శ్రీశైలానికి భారీ వరద.. 10 గేట్లు ఎత్తివేత

శ్రీశైలానికి భారీ వరద.. 10 గేట్లు ఎత్తివేత

కృష్ణా ప్రాజెక్టులకు ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు దాదాపు 4 లక్షల 60 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తి... దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు అధికారులు నీటిని రిలీజ్ చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను.. ప్రస్తుత నీటిమట్టం 884 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 212 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది. 

జూరాల ప్రాజెక్ట్‌కు కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం 4 లక్షల 15 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. 43 గేట్లు ఎత్తి 4 లక్షల 6 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 9 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 6 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

కాగా.. శ్రీశైలం గేట్లు ఎత్తడంతో నాగార్జున సాగర్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది.  ఇన్ ఫ్లో 2 లక్షల క్యూసెక్కులుగా ఉండగా.. అవుట్ ఫ్లో 9 వేల 154 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 543 అడుగుల మేర నీరు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 195.69 టీఎంసీల నీరు ఉంది.