- ఈ ఏడాది ప్రాజెక్ట్‌కు 220 టీఎంసీల వరద
- తెలంగాణ వాడింది 19 టీఎంసీలే
- ..ఏపీ తోడేసింది 61 టీఎంసీల జలాలు
- పాలమూరు పూర్తికాక దక్కని మన వాటా..
- పోతిరెడ్డిపాడుతో తరలించుకుపోయిన ఏపీ
- ఇక తాగునీటికి నాగార్జున సాగరే దిక్కు!
- ప్రస్తుతం ఉన్నది 52.5 టీఎంసీలే
హైదరాబాద్, వెలుగు: వానాకాలం ముగిసి చలికాలం మొదలవుతుండగానే కృష్ణా బేసిన్‌కు నీటి గండం ముంచుకొచ్చింది. కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు దాదాపు ఖాళీ అయిపోయింది. డెడ్ స్టోరేజీ పోగా, ప్రాజెక్టులో వాడుకోదగిన నీరు కేవలం 3.635 టీఎంసీలే ఉంది. ఈ ఏడాది ఎగువ నుంచి శ్రీశైలానికి దాదాపు 220 టీఎంసీల మేర వరద రాగా.. పెండింగ్ప్రాజెక్టుల కారణంగా తన వాటా మేరకు నీటిని ఎత్తిపోసుకోలేని తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది.
ఇదే అదనుగా పొరుగు రాష్ట్రం ఏపీ ఏకంగా 60.5 టీఎంసీలను తోడేసుకున్నది. మన రాష్ట్రం కేవలం 19 టీఎంసీల నీళ్లే వాడుకున్నది. శ్రీశైలంలో కరెంట్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్‌కు దాదాపు 140 టీఎంసీల నీళ్లు వచ్చినా.. ప్రస్తుతం సాగర్‌లో డెడ్ స్టోరేజీకి ఎగువన వాడకానికి 52.5 టీఎంసీలే మిగిలాయి. రానున్న వేసవిలో హైదరాబాద్ మహానగరంతోపాటు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల దాహార్తి తీర్చే భారం పూర్తిగా నాగార్జునసాగర్‌పైనే పడింది. ఈ నీటిలో వాటాకోసం కూడా ఏపీ పేచీపెడ్తే పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
శ్రీశైలంలో ఏపీ దోపిడీ.. మనకు నిరాశ
ప్రస్తుతం శ్రీశైలం నీటిమట్టం 836.9 అడుగులకు పడిపోయింది. నీటి నిల్వ 57.486 టీఎంసీలు ఉండగా, ప్రాజెక్టు కనీస నీటిమట్టం 834 అడుగులు (53.851 టీఎంసీలు). అంటే డెడ్ స్టోరేజ్‌కు ఎగువన ఉపయోగించుకోదగిన లైవ్ స్టోరేజ్ కేవలం 3.635 టీఎంసీలు మాత్రమే మిగిలింది. ఏపీ ఇప్పటివరకు 60.478 టీఎంసీల నీళ్లు తరలించుకోగా.. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారానే చెన్నై కోటా మినహాయించి 31.115 టీఎంసీలను తోడుకున్నది. దీనికితోడు మల్యాల (హంద్రీనీవా) ద్వారా 18.642 టీఎంసీలు, వెలిగొండను ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే 6.592 టీఎంసీలు, ముచ్చుమర్రి ద్వారా 1.311 టీఎంసీలు, చెన్నై వాటా కింద 2.471 టీఎంసీలు వెరసి మొత్తం 60.478 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి ఎత్తిపోసుకున్నది.
శ్రీశైలానికి వరద పోటెత్తిన సమయంలో మన నీళ్లను ఒడిసిపట్టే ప్రాజెక్టులు అందుబాటులో లేకపోవడం తెలంగాణ పాలిట శాపంగా మారింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల స్కీ పనులు పూర్తికాక కేవలం 1.417 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోసుకోగలిగాం. గత పాలకులు నిర్లక్ష్యం చేయడంతో వరద చెప్పుకునే స్థాయిలో వచ్చినప్పటికీ మన వాటా నీళ్లు రిజర్వాయర్లలో నింపుకోలేని పరిస్థితి ఎదురైంది.ఈ క్రమంలో మనం వాడుకున్నది కేవలం 19.321 టీఎంసీలే కావడం గమనార్హం. కల్వకుర్తి లిఫ్ట్ ద్వారా 16.668 టీఎంసీలు, చెన్నై కోటా కింద 1.236 టీఎంసీలు, పాలమూరు ట్రయల్ రన్ రూపంలో కేవలం 1.417 టీఎంసీలు మాత్రమే తీసుకోగలిగాం.
తాగునీటికి సాగరే దిక్కు..
శ్రీశైలం అడుగంటడంతో ఇప్పుడు తెలంగాణ కళ్లన్నీ నాగార్జున సాగర్‌పైనే ఉన్నాయి. సాగర్ నీటిమట్టం 538 అడుగుల వద్ద ఉంది. నీటి నిల్వ 184.184 టీఎంసీలు కాగా.. డెడ్ స్టోరేజ్ 131.669 టీఎంసీలు పోగా, ప్రస్తుతం వాడుకోదగిన నీళ్లు 52.515 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. మనం సాగర్ నుంచి వాడిన 39.952 టీఎంసీల్లో 18.021 టీఎంసీలు కేవలం తాగునీటికే వెళ్లిపోయింది. హైదరాబాద్ జలమండలి ద్వారా 6.577 టీఎంసీలు, నల్గొండ దాహార్తి కోసం ఏఎమ్మార్పీ లిఫ్ట్ ద్వారా 11.444 టీఎంసీలను ఉపయోగించారు. మిగిలిన 21.931 టీఎంసీలు సాగర్ ఎడమ కాల్వ కింద వాడారు. అటు ఏపీ సైతం సాగర్ కుడి కాల్వ ద్వారా 17.207 టీఎంసీలను ఇప్పటికే తీసుకున్నది.
బేసిన్ మొత్తం మీద ఏపీదే పైచేయి
కృష్ణా బేసిన్వ్యాప్తంగా ఉమ్మడి ప్రాజెక్టులు, జూరాల, తుంగభద్ర, ప్రకాశం బ్యారేజీ తదితరాలన్నింటిలోనూ ఏపీనే అత్యధిక నీటిని తరలించుకుపోయింది. ఇప్పటివరకు బేసిన్లో వాడుకున్న నీళ్లు 211.531 టీఎంసీలుకాగా.. ఏపీ తరలించుకున్న నీళ్లే 117.308 (55.46%) టీఎంసీలు. వాడుకున్న నీళ్లు 94.223 టీఎంసీలు (44.54%). శ్రీశైలం, సాగర్‌లలో కలిపి కేవలం 56.150 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. శ్రీశైలాన్ని అడ్డగోలుగా ఖాళీ చేసిన ఏపీ.. సాగర్ నీళ్ల కోసం కూడా పట్టుబట్టే ప్రమాదం ఉంది. కృష్ణా బోర్డు మీటింగ్ లో ఏపీకి నీళ్లు ఇవ్వకుండా గట్టిగా వాదించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎల్‌నినో ముప్పు.. ఎండాకాలం గట్టెక్కేదెలా?
వచ్చే ఏడాది జులై వరకు దాదాపు 9 నెలలపాటు హైదరాబాద్ నగరంతోపాటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం పట్టణాలు, పల్లెలకు తాగునీరు అందించాలంటే సాగర్‌లో ఉన్న ఈ 52.5 టీఎంసీలే ఆధారం. ప్రస్తుతం ఎల్‌నినో ముప్పు తీవ్రమవుతున్న తరుణంలో ప్రాజెక్టుల్లోని నీటిని కేవలం తాగడానికే వినియోగించాలని ఇప్పటికే నిర్ణయించారు. సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు యాసంగికి సాగునీరు తీసుకోకపోయినా.. తాగునీటికే నెలకు సగటున 4 నుంచి 5 టీఎంసీల దాకా అవసరమవుతుందని చెప్తున్నారు. దీనికితోడు ఎండల తీవ్రతకు ఆవిరి నష్టాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయని అంటున్నారు. ఏపీ కూడా కుడి కాల్వ కింద నీటి కోసం ఒత్తిడి తీసుకొస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
