శ్రీశైలంలో నీటి నిల్వలు పడిపోయాయి.. రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి

శ్రీశైలంలో నీటి నిల్వలు పడిపోయాయి.. రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి
  • నాగర్‌‌‌‌కర్నూల్‌‌ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

నాగర్​కర్నూల్, వెలుగు: శ్రీశైలం రిజర్వాయర్‌‌‌‌లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయని, రైతులు ప్రత్యామ్నాయంగా ఆరు తడి పంటలు వేసుకోవాలని నాగర్‌‌‌‌కర్నూల్‌‌ కలెక్టర్​ హేమంత కేశవ పాటిల్​సూచించారు. ఆదివారం ఇరిగేషన్​చీఫ్​ఇంజినీర్​నివేదికను వివరించారు. ప్రస్తుతం ఉన్న శ్రీశైలంలో 41 టీఎంసీల్లో 30 టీఎంసీలు డెడ్​స్టోరేజీగా పోగా.. మిగిలిన 11 టీఎంసీల్లో 7 టీఎంసీలు ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల తాగునీటి అవసరాలకు వినియోగించాల్సి ఉందన్నారు. 

మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల సాగునీటి పథకం పరిధిలోని నాలుగు రిజర్వాయర్లలో నీటి నిల్వలు లేకపోవడంతో ఆయకట్టులోని 4.51లక్షల ఎకరాలకు సాగునీరు అందే పరిస్థితి లేదన్నారు. ఎల్‌‌నినో ఎఫెక్ట్‌‌తో ఎగువన వర్షాలు లేకపోవడంతో శ్రీశైలం జలాశయంలోకి ఆశించిన స్థాయిలో వరద జలాలు చేరలేదని వివరించారు. 

దీని కారణంగా నాగర్ కర్నూల్ జిల్లాలో సాగునీటి సరఫరా క్లిష్టంగా మారిందన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగడ, గుడిపల్లిగట్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో 4.12 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 2.23 టీఎంసీలు మాత్రమే ఉందని, ఈ పరిస్థితుల్లో సాగుకు విడుదల చేస్తే భవిష్యత్తులో తాగునీటి సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. 

శ్రీశైలం జలాశయానికి వరద పెరిగితే ప్రభుత్వ నిర్ణయం మేరకు సాగునీటి విడుదలపై చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కోరారు.