బషీర్బాగ్, వెలుగు: సిటీలో మరోసారి చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. ఖమ్మం జిల్లాకు చెందిన దుంపల మౌనిక (25) అబిడ్స్ ఛాపెల్ రోడ్లోని మల్లారెడ్డి హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తుంది. మంగళవారం నైట్ డ్యూటీ ముగించుకొని బుధవారం ఉదయం తన హాస్టల్వైపు నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో ఓ దుండగుడు ఆమె మెడలో ఉన్న 2.5 తులాల బంగారు గొలుసును బైక్పై వచ్చి లాక్కొని పరారయ్యాడు. ప్రతిఘటించిన మౌనిక చేయి, ముఖానికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న అబిడ్స్ పోలీసులు, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధితురాలు నివాసం ఉండే హాస్టల్ వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఆమెకు అందజేశారు. పరిసర ప్రాంతాలు, పారిపోయిన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీను జల్లెడ పట్టి 9 గంటల వ్యవధిలోనే యాకత్పురా ప్రాంతానికి చెందిన నిందితుడు మహ్మద్ సల్మాన్ పాషాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్యల కోసం అబిడ్స్ పోలీసులకు అప్పగించారు.
