తడిసిన వడ్లను ఫోర్టిఫైడ్‌‌‌‌ బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌గా మార్చాలి

తడిసిన వడ్లను ఫోర్టిఫైడ్‌‌‌‌ బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌గా మార్చాలి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దాదాపు 4.94 లక్షల టన్నుల ధాన్యం తడిసినట్లు సివిల్‌‌‌‌ సప్లైస్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్రాథమిక అంచనా వేసింది. దీనికి సంబంధించిన నివేదికలను జిల్లాల వారీగా సేకరించింది. దీంతో తడిసిన వడ్లను ఫోర్టిఫైడ్‌‌‌‌ బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌గా మార్చాలని సర్కారు నిర్ణయించింది. కేంద్రం ఇటీవల సాధారణ బాయిల్డ్ రైస్‌‌‌‌కు బదులుగా కొంత మేర ఫోర్టిఫైడ్ బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌ను తీసుకునేందుకు ఇప్పటికే అనుమతించింది. ఈ క్రమంలో యాసంగికి సంబంధించిన తడిసిన వడ్లతో పాటు మరో 3.01 లక్షల టన్నుల వడ్లు కలిపి మొత్తం 7.95 లక్షల టన్నుల ధాన్యాన్ని (5 లక్షల టన్నుల రైస్) ఫోర్టిఫైడ్ బాయిల్డ్​ రైస్​గా మార్చాలని సివిల్‌‌‌‌ సప్లైస్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ అనిల్‌‌‌‌ కుమార్‌‌‌‌ తాజాగా మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశారు. తడిసిన వడ్లు మిల్లింగ్‌‌‌‌ చేసి రైస్‌‌‌‌గా మార్చడానికి వీలయ్యే పరిస్థితి లేదని అధికారులు తేల్చారు. దీంతోనే ఈ ధాన్యాన్ని ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్‌‌‌‌గా మార్చాలని నిర్ణయించారు.

20 లక్షల టన్నులు ఫోర్టిఫైడ్ రైస్‌‌‌‌ తీసుకోవాలి..

గత యాసంగి సీజన్‌‌‌‌లో రైతుల నుంచి సివిల్‌‌‌‌ సప్లైస్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ద్వారా సర్కారు 50.99 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేసింది. కేంద్రం బాయిల్డ్ రైస్‌‌‌‌కు బదులుగా రారైస్‌‌‌‌ ఇవ్వాలని రాష్ట్రానికి తెలిపింది. ఈ నేపథ్యంలో బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌కు బదులుగా కనీసం 20 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్ రైస్‌‌‌‌ తీసుకోవాలని రాష్ట్ర సివిల్‌‌‌‌ సప్లైస్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ కేంద్రానికి లెటర్‌‌‌‌ రాశారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లి ఎఫ్‌‌‌‌సీఐ, కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపారు. దీనిపై ఇంకా ఎఫ్‌‌‌‌సీఐ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. సివిల్‌‌‌‌ సప్లైస్‌‌‌‌ ప్రతిపాదనను కేంద్రం అనుమతిస్తే నూక శాతం సమస్య నుంచి కొంత వరకు బయట పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.