
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ ను నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. బేగంపేటలోని అనంత రిహాబిలేషన్ సెంటర్ కు వెళ్లి డాక్టర్లను కలిసి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అరవింద్. శ్రీ తేజ్ చికిత్సకు సహకరిస్తున్నారని చెప్పారు డాక్టర్లు. అనంతరం శ్రీతేజ్ కుటుంబ సభ్యులు,బంధువులతో కలిసి కాసేపు మాట్లాడారు.
శ్రీ తేజ్ కోలుకోవడం కోసం తమ కుటుంబం అంతా ఎదురుచూస్తోందన్నారు అల్లు అరవింద్. శ్రీతేజ్ రోజురోజుకు కోలుకుంటున్న విషయం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. త్వరలోనే శ్రీ తేజ్ మనందరి మధ్య సాధారణ పిల్లల్లా ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు అరవింద్. ఈ ఘటనలో శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కు పుష్ప నిర్మాత నవీన్ యేర్నేని రూ. 50 లక్షలు, డైరెక్టర్ సుకుమార్ రూ.50 లక్షలు, అల్లు అర్జున్ రూ. కోటి పరిహారం ప్రకటించారు. దాదాపు ఐదు నెలల పాటు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందిన శ్రీతేజ్ ఏప్రిల్ 29న డిశ్చార్జ్ చేసి బేగంటపేటోని రిహాబిలేషన్ సెంటర్ కు తరలించిన సంగతి తెలిసిందే..
సికింద్రాబాద్ సంధ్య థియేటర్ దగ్గర 2024 డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడం వల్ల తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే..ఈ ఘటనలో సినిమాకు వచ్చిన రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి శ్రీతేజ్ సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడని. గత కొన్ని రోజులుగా లిక్విడ్స్ నోటితో తీసుకుంటున్నాడని శ్రీతేజ్ తండ్రి చెప్పారు. అయితే మనుషుల్ని ఇంకా గుర్తుపట్టట్లేదని అన్నారు. శ్రీతేజ్ మామూలు స్థితికి రావడానికి ఇంకా సమయం పడుతుందని డాక్టర్లు చెప్పినట్లు వెల్లడించారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఏ11 గా ఉన్న అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. తర్వాత కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ బయటకొచ్చాడు. అల్లు అర్జున్ కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని కోర్టు ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా ప్రతి ఆదివారం వ్యక్తిగతంగా సంతకం చేయడానికి అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది.