శీతల అష్టమి ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మహిళలు మృతి : చద్దన్నం ప్రసాదం సమర్పణకు ఎగబడిన భక్తులు

శీతల అష్టమి ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మహిళలు మృతి : చద్దన్నం ప్రసాదం సమర్పణకు ఎగబడిన భక్తులు

నలంద: బిహార్లోని నలందలో విషాద ఘటన జరిగింది. చైత్ర మాసంలో చివరి మంగళవారం కావడంతో మాతా శీతలాష్టమి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ సమయంలో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 8 మంది చనిపోయారు.

నలందలోని మాఘ్రాలో ఉన్న మాతా షీత్లా దేవి ఆలయంలో ఈ దురదృష్ట ఘటన జరిగింది. చనిపోయిన ఎనిమిది మంది మహిళలే కావడం శోచనీయం. ఈ తొక్కిలాట ఘటనలో మరో ఆరుగురు భక్తులు కూడా గాయపడ్డారు. ఈ తొక్కిసలాట కారణంగా ఆలయంలో భక్తులు భయంతో కేకలేశారు. అక్కడ నుంచి బయటపడే ప్రయత్నం చేశారు.

చనిపోయిన వాళ్లలో ఇప్పటివరకు ఇద్దరు మహిళలను పోలీసులు గుర్తించారు. బీహార్‌లోని శకుంత్‌కు చెందిన దినేష్ రజక్ భార్య రీటా దేవి (50), మథురాపూర్ నూర్సరాయ్‌కు చెందిన కమలేష్ ప్రసాద్ భార్య రేఖా దేవి (45) చనిపోయిన వాళ్లలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మోడల్ ఆసుపత్రికి తరలించారు. చైత్ర మాసం చివరి మంగళవారం నాడు ప్రతీ సంవత్సరం ఈ ఆలయంలో ఇదే తరహాలో భారీగా భక్తులు పోటెత్తుతారు.

భద్రతా లోపం కారణంగానే ఈ తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ఈ ఆలయం బిహార్‌లోని నలంద నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాఘ్రా గ్రామంలో ఉంది. ఇక్కడ ప్రధాన పూజ చైత్ర మాసంలోని కృష్ణ పక్షం అష్టమి (శీతలాష్టమి) నాడు జరుగుతుంది. 

శీతలాష్టమి రోజున ఇళ్లలో పొయ్యిలు వెలిగించరు. ఇక్కడ అది ఒక సంప్రదాయం. భక్తులు ఒక రోజు ముందు తయారుచేసిన చల్లారిన ఆహారాన్ని.. వాడుక భాషలో చెప్పాలంటే చద్దన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారిని దర్శించుకుని ఈ చద్దన్నం నైవేద్యంగా సమర్పిస్తే దుష్ట శక్తులు తమను వదిలిపోతాయని, మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.

తొక్కిసలాటకు కారణం ఏంటంటే..
శీతల మాత అష్టమి ఆలయం ప్రత్యేకత ఒకటి ఉంది. ఈ ఆలయంలో చైత్ర మాసం చివరి మంగళవారం రోజును శీతల మాతకు ప్రసాదం సమర్పిస్తారు. ఈ ప్రసాదం ఏంటంటే.. ముందు రోజు చేసిన ఆహారాన్ని.. అన్నం లేదా ఇతర ఆహారాన్ని ప్రసాదంగా సమర్పిస్తారు. అంటే చద్దన్నం అనమాట.. దీన్ని బీహార్ లో బస్సీ అంటారు. శీతల మాతకు ఈ ఆహారం సమర్పించటం ఇక్కడ ఆనవాయితీ. చైత్ర మాసం చివరి మంగళవారం రోజు కావటం.. అష్టమి రోజు అనేది మంచి ముహూర్తంగా భావిస్తారు అక్కడి ప్రజలు.

శీతల మాతకు బస్సీ ( మనం చద్దన్నం అంటాం) ప్రసాదం సమర్పించేందుకు పెద్ద ఎత్తున మహిళలు ఎగబడ్డారు. ఆలయం లోపల స్థలం తక్కువగా ఉండటం.. వేల సంఖ్యలో ఉదయాన్ని మహిళలు ప్రసాదంతో తరలిరావటంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఎనిమిది మంది మహిళలు చనిపోయారు. మరికొంత మంది మహిళలు గాయపడ్డారు.