జెలెన్‌స్కీ ప్రసంగానికి స్టాండింగ్ ఒవేష‌న్‌

జెలెన్‌స్కీ ప్రసంగానికి స్టాండింగ్ ఒవేష‌న్‌

కీవ్:  ఒకప్పుడు టీవీ షోల్లో కమెడియన్.. ప్రెసిడెంట్​గా వేషంవేసి తన మాటలతో జనాలను కడుపుబ్బా నవ్వించేటోడు. అట్లాంటిది ఇప్పుడు దేశానికి ప్రెసిడెంట్​అయినంక మాత్రం రియల్​ హీరో అనిపించుకుంటుండు. రష్యా ఆర్మీకి ఎదురునిలిచి పోరాడుతున్నడు. యుద్ధం వద్దని, కూర్చుని మాట్లాడుకుందామని పిలుస్తూనే.. తమపై దాడిచేస్తే ఎదురునిలిచి పోరాడతామని ముందే చెప్పిండు. ఇప్పుడు చేతల్లో చూపిస్తున్నడు. తమ దేశాన్ని కాపాడుకుంటమని, రష్యాకు లొంగిపోయేదిలేదని తేల్చిచెప్పిండు. యుద్ధంలో ఏ దేశమూ సాయంగా రాకపోయినా ధైర్యంగా నిలబడ్డడు. రష్యాపై ఆంక్షలు విధించాలంటూ అటు నాటో దేశాలతో పాటు ఇటు ఈయూ దేశాలకు రిక్వెస్ట్​ చేస్తున్నడు. తమ భూభాగంలోకి అడుగుపెట్టిన రష్యన్​ సైనికులకు చుక్కలు చూపిస్తున్నడు. కీవ్​ను కంట్రోల్​లోకి తెచ్చుకోవాలన్న రష్యా ఆలోచనను సాగనివ్వట్లేదు. కీవ్​ వీధుల్లో తిరుగుతూ తన సైనికులకు తోడుగా నిలుస్తున్నడు. రష్యా ఫస్ట్​ టార్గెట్​తనే అని తెలిసినా వెన్నుచూపట్లే.. కీవ్​నుంచి జాగ్రత్తగా బయటకు తీసుకొస్తమంటూ అమెరికా ముందుకొచ్చినా వద్దన్నడు. పారిపోయి ప్రాణాలు దక్కించుకోవాలన్న ఆశ తనకులేదని  తేల్చిచెప్పిండు. రష్యా సైనికులకు తమ వీపు ఎన్నటికీ కనిపించదని జెలెన్​స్కీ స్పష్టం చేసిండు. రష్యన్లను ఎదుర్కోవడానికి ముందుకు రావాలంటూ జెలెన్​స్కీ ఇచ్చిన పిలుపును అందుకుని ఉక్రెయిన్​ పౌరులు తుపాకులు చేతబట్టిన్రు. విదేశాల్లో ఉన్న ఉక్రెయిన్లు కూడా చాలామంది తిరిగొస్తున్నరు. ఈ యుద్ధంలో ఓడిపోతమని తెలిసీ ఫైట్​ చేస్తున్నరు. దేశంలోని అన్నిటినీ, అందరినీ జెలెన్​స్కీ కలుపుకుపోతున్నడు. దేశం కోసం ఫైట్​ చేస్తామన్న ఖైదీలకూ ఆయుధాలు, ట్రైనింగ్​ ఇస్తున్నడు. తాజాగా, మంగళవారం వీడియో కాల్​ ద్వారా జెలెన్​స్కీ ఈయూ​ పార్లమెంట్​లో మాట్లాడిండు. ఫ్రీడం కోసం, దేశం కోసం తాము పోరాడుతున్నామన్నారు. తాము ఉక్రెయినీయులమని, శక్తిమంతులమని, తమనెవ్వరూ విడదీయలేరని చెప్పారు. మీరంతా మాకు అండగా నిలబడాలె.. మీతోడు లేటే ఉక్రెయిన్​ ఒంటరైపోతుంది. ఈ యుద్ధ పరిస్థితుల్లో మమ్మల్నిలా వదిలేయబోమని నమ్మకం కలిగించండి.. అంటూ జెలెన్​స్కీ ఎమోషనల్​గా మాట్లాడారు. ఆ వెంటనే సభ్యులంతా లేచి ఆయన్ను అభినందిస్తూ చప్పట్లు కొట్టారు.