ఎలా కావాలంటే అలా మారే ‘స్మార్ట్​ ఈ హోం’

ఎలా కావాలంటే అలా మారే ‘స్మార్ట్​ ఈ హోం’

ఎండాకాలం.. రాత్రంతా ఒకటే ఉక్కపోత. కునుకుపట్టదు. ఏసీలు వాడదామంటే ప్రకృతికి ముప్పు. మరెట్లా..? మంచంపై వేసిన పక్కే ఒంటిని చల్లగా చేసేస్తది. వాతావరణానికి తగ్గట్టు మారిపోతుంది. హాల్లో సోఫా వేసేసినం. ఎక్కడికక్కడ అందంగా అలంకరించినం. ఇంకో చిన్న వస్తువు పెడదామంటే జాగా కరువాయె. ఏం చేయాలి? కంగారేం లేదు. ఆ సోఫా హాల్లో చోటుకు తగ్గట్టు అడ్జస్ట్​ అయిపోతుంది. దానికి తొడిగిన కవర్లు వాతావరణానికి తగ్గట్టు రంగులు మార్చుకుంటాయి.

….ఇవే కాదు. ఆ స్మార్ట్​ హోంలో ప్రతిదీ స్పెషలే. మన మూత్రం, మలం అంతా వేస్టే. కానీ, ఆ వేస్ట్​నూ వాడేసి కరెంట్​గా మార్చేస్తుంది. గోడలను గోడల్లా కాకుండా మనకు నచ్చిన, అందమైన లొకేషన్లతో వర్చువల్ రియాలిటీ ‘వాల్​ పేపర్ల’ను షో చేసేస్తుంది. ఇంటి పైన ఇసుక, గులక రాళ్లలో పంటలను పెంచుకునేలా పచ్చటి వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆ ఇల్లే ‘స్మార్ట్​ ఈ–హోం’. బ్రిటన్​కు చెందిన స్మార్ట్​ ఎనర్జీ జీబీ అనే సంస్థ ఈ సరికొత్త పర్యావరణహితమైన ఇంటికి డిజైన్​ చేసింది. సోమవారం దానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. అతి త్వరలోనే దానిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇల్లుగల్లోళ్లు నోరు తెరిచి ఒక్క మాట చెబితే చాలు ఎలా కావాలంటే అలా మారిపోతుంది ఈ స్మార్ట్​ హోం. అంతేకాదు, ఎక్కడికైనా వెళ్లాలంటే ఒక కమ్యూనిటీలోని వాళ్లంతా ఒక కరెంట్​ వాహనంలో (ఎలక్ట్రిక్​ వెహికిల్​– ఈవీ) కలిసి (పూలింగ్​) ప్రయాణించే అవకాశమూ ఉంది. చెత్తను ఎరువులుగా మార్చేందుకు కంపోస్టింగ్​ బిన్​ను ఇంట్లో పెట్టారు. చాలా మంది పర్యావరణహిత ఇళ్లను కోరుకుంటున్నారని, అందులో 83 శాతం మంది ఎకోఫ్రెండ్లీతో పాటు టెక్నాలజీపైనా ఆసక్తి చూపిస్తున్నారని కంపెనీ చెబుతోంది. అందుకే పచ్చదనంతో పాటు ఇలా టెక్నాలజీని కలిపి ఈ స్మార్ట్​ ఈ హోంను సృష్టిస్తున్నట్టు తెలిపింది. బ్రిటన్​లో చాలా మందిని సర్వే చేసి ఈ ఇంటికి రూపమిచ్చినట్టు తెలిపింది.