న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్‌ఐ) నిర్వహించే నేషనల్ సెలెక్షన్ ట్రయల్స్‌లో తాను పాల్గొనబోనని స్టార్ రెజ్లర్ బజ్‌రంగ్ పూనియా తెలిపాడు. ఈ మేరకు మార్చి 10, 11న జరిగే ట్రయల్స్‌పై స్టే ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో అత్యవసర ఉమ్మడి పిటిషన్‌ను దాఖలు చేశాడు. వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, సత్యవర్త్ కడియాన్‌తో కలిపి ఈ పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. దీనిపై శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది. ఇండియన్ రెజ్లింగ్‌కు సంబంధించిన అంశాలపై సెంట్రల్ గవర్నమెంట్ మౌనంగా ఉండటాన్ని ఈ సందర్భంగా బజ్‌రంగ్ ప్రశ్నించాడు.
కిర్గిస్తాన్‌లో జరిగే ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ కోసం ఈ సెలెక్షన్ ట్రయల్స్‌ను నిర్వహిస్తున్నారు. అయితే ఆసియా టోర్నీ కోసం తాను రెండు నెలల నుంచి విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్నానని, ఇందుకోసం చాలా మొత్తం ఖర్చు చేశానని బజ్‌రంగ్ వెల్లడించాడు. అయినప్పటికీ డబ్ల్యూఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ట్రయల్స్ నిర్వహిస్తే పోటీ చేయబోనని స్పష్టం చేశాడు.
