ఇల్లు, ఆస్తులే కాదు..ముఖం కూడా అమ్ముకునే బిజినెస్ స్టార్ట్

ఇల్లు, ఆస్తులే కాదు..ముఖం కూడా అమ్ముకునే బిజినెస్ స్టార్ట్

ఇల్లు అమ్ముకుంటారని తెలుసు, ఆస్తులు అమ్ముకోవటం కూడా తెలుసు. కానీ, ముఖం అమ్ముకోవటం తెలుసా? వినటానికే వింతగా ఉంది కదా. ఎవరైనా ముఖాన్ని ఎలా అమ్ముకుంటారు అనిపిస్తోందా?  అయితే ఓసారి టోక్యో లోని ‘కమెన్యా ఒమాటో’ గురించి తెలుసుకోవాల్సిందే…

టెక్నాలజీలో జపాన్ చాలా ముందు ఉంటుందన్నది  తెలిసిందే. అక్కడ ఉండే ప్రతీ సిటిజన్ పని చేస్తూనే ఉంటారు. పని గంటలు అనే విషయమే ఉండదక్కడ. ప్రతీ విషయాన్ని మనీగా మార్చుకోవటం ఎలా అన్నదే వాళ్ల ఆలోచన. మార్కెట్‌లో ఏదో ఒక కొత్త విషయాన్ని తేవటం వాళ్ల అలవాటు. అలాగే ఈసారి ‘ముఖాల అమ్మకం’ అనే కొత్త కాన్సెప్ట్ ని తెరమీదకి తెచ్చారు. వినటానికే విచిత్రంగా ఉన్నా ఇప్పుడు జపాన్‌లో లేటెస్ట్ బిజినెస్– ‘ఫేస్ సెల్లింగ్‌’

‘కమెన్యా ఒమాటో’ అనే కంపెనీ జపాన్ క్యాపిటల్ టోక్యోలో ఉంది. ఆ కంపెనీ ఇప్పుడు ముఖాలని కొంటోంది. ఒక్కొక్క ముఖానికి 40 వేల యెన్‌లు ఇస్తున్నారట. అంటే మన కరెన్సీలో దాదాపు 30 వేల వరకూ ఉంటుంది. అలా తీసుకున్న ముఖాలని 3డీ ప్రింట్ చేసి మళ్లీ అమ్ముకుంటారట. అంటే మన ఫేస్‌  ఫొటోలు, వీడియోలు తీసుకొని అచ్చంగా మనలాంటి మాస్క్ తయారు చేసి అమ్మేస్తారన్నమాట.

 

అలా ఒక్కొక్క మాస్క్ ధర మాత్రం ముఖం కొన్న ధరకంటే దాదాపు రెట్టింపు ఉంటుంది. అంటే మన ముఖం అమ్మాలంటే 30 వేలు. ఇంకొకళ్ల ముఖాన్ని కొనుక్కోవాలంటే 60 వేల వరకు కట్టాలి. ఈ మాస్క్ పెట్టుకున్న వాళ్లను మరీ దగ్గరగా చూస్తే తప్ప అది మాస్క్ అని గుర్తు పట్టడం కష్టం. ఈ ప్రాజెక్టుకు ఆ సంస్థ ‘దట్ ఫేస్’ అని పేరు పెట్టింది.  అలా మాస్క్ కోసం ముఖం అమ్ముకున్న వాళ్ల ముఖానికి డిమాండ్ ఎక్కువ ఉండి, ఆ మాస్క్ లు ఎక్కువగా సేల్ అయితే ఆ అమ్మకాల్లోనూ వాటా ఇస్తామనే ఆఫర్ కూడా ఉంది. ఇంతకీ ఇలా వేరే వాళ్ల ఫేస్‌ మాస్కులు కొనుక్కుని ఏం చేస్తారన్నదే  ప్రశ్న. అదే ప్రశ్నని అక్కడ ఉండే కొందరు అడుగుతున్నారు. మనదగ్గర అంటే ఎత్తులో, బరువులో చాలా తేడాలుంటాయి. కానీ జపాన్ వాళ్ల బాడీ అనాటమీ దాదాపుగా ఒకేలా ఉంటుంది. అలాంటప్పుడు అంత నేచురల్‌గా ఉండే మాస్కులని పెట్టుకొని ఈజీగా నేరాలు చేసి తప్పించుకునే అవకాశం ఉంది కదా! అన్నది వీళ్ల వాదన. నిజమే కదా!

మన ముఖం పెట్టుకొని ఎక్కడో ఎవడో నేరం చేస్తే? ఆ చిక్కుల్లో మనం ఇరుక్కోవాల్సి రావచ్చు. సరదాగా అయితే బాగానే ఉంటుంది కానీ మన ముఖం వేరే వాడు వాడటమే విచిత్రంగా అనిపిస్తుంది.  అందుకే ‘కమెన్యా ఒమాటో’ మేనేజ్‌మెంట్ కూడా తన జాగ్రత్తలో తానుంది. ఇక్కడ ఫేస్‌ అమ్మాలి అంటే తర్వాత జరిగే ఏ సంఘటనలకీ కంపెనీ బాధ్యత వహించదు, ఫేస్‌  అమ్మటానికి ఎలాంటి అబ్జెక్షన్స్ లేవనీ లీగల్‌గా ఒప్పందం చేసుకుంటోంది. జనం కూడా డబ్బులు వస్తున్నాయి కదా అని వాళ్ల వాళ్ల ఫేస్‌లని  అమ్మటానికి బాగానే వెళ్తున్నారు.
మాస్కుల వ్యాపారం కూడా బాగానే జరుగుతోందట. ఈ మాస్కులు ఎంత నేచురల్ గా ఉన్నా వాటిని మరీ ఎక్కువ సేపు వాడలేరు, ఎందుకంటే మాస్క్ పెట్టుకున్నప్పుడు కళ్లు కూడా మూసుకుపోతాయి. ఫొటోకి ఫోజిచ్చే వరకూ ఇది ఓకే. ఒక వేళ మాస్క్ తో మరికాసేపు ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం మాస్క్ కళ్ల దగ్గర కట్ చేయాల్సిందే.