న్యూఢిల్లీ: 2025 సంవత్సరం ఐపీఓ మార్కెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. కంపెనీలు రికార్డు స్థాయిలో రూ.1.76 లక్షల కోట్లు సేకరించాయి. దేశీయ మార్కెట్లలో నగదు లభ్యత, ఇన్వెస్టర్ల ఆసక్తి ఇందుకు కారణాలు. గత ఏడాది రూ.1.6 లక్షల కోట్లు, 2023లో రూ.49,436 కోట్లు మాత్రమే సమీకరించాయి. ఈ ఏడాది 103 కంపెనీలు ఐపీఓ ద్వారా మార్కెట్లోకి అడుగుపెట్టాయి.
స్టార్టప్ ఐపీఓలు మళ్లీ పుంజుకున్నాయి. లెన్స్‌కార్ట్, గ్రో, మీషో, ఫిజిక్స్ వాలా వంటి 18 స్టార్టప్ కంపెనీలు రూ.41 వేల కోట్లకు పైగా నిధులు సేకరించాయి. 2024లో స్టార్టప్ కంపెనీలు రూ.29 వేల కోట్లు సేకరించాయి. మొత్తం నిధుల సేకరణలో ఓఎఫ్ఎస్ వాటా 60 శాతం ఉంది. ఇష్యూల సగటు పరిమాణం రూ.1,700 కోట్లు దాటింది. 2026లోనూ కూడా ఐపీఓల హవా కొనసాగనుంది.
ఇప్పటికే 75 కంపెనీలకు సెబీ అనుమతి ఇవ్వగా, మరో 100 కంపెనీలు క్యూలో ఉన్నాయి. రిలయన్స్ జియో, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఓయో, ఫోన్ పే వంటి బడా కంపెనీలు వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్నాయి. ఈ ఏడాది లిస్ట్ అయిన కంపెనీలలో 70 శాతం లాభాలను అందించాయి
3 కంపెనీల ఐపీఓలకు గ్రీన్ సిగ్నల్
స్టాక్ మార్కెట్లో ఐపీఓల జోరు కొనసాగుతోంది. నిర్మాణ రంగ సంస్థ దరివాల్ బిల్డ్ టెక్, క్లౌడ్ మౌలిక సదుపాయాల సేవలు అందించే ఈఎస్డీఎస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్, బీఎల్ఎస్ పాలిమర్స్ కంపెనీలు ఐపీఓల ద్వారా నిధులు సేకరించేందుకు సెబీ అనుమతి పొందాయి. ఈ మూడు కంపెనీలు కేవలం కొత్త షేర్ల జారీ ద్వారానే నిధులను సమీకరించాలని నిర్ణయించుకున్నాయి. దరివాల్ బిల్డ్ టెక్ రూ.950 కోట్ల విలువైన కొత్త షేర్లను విక్రయించనుంది. ఈ నిధులలో రూ.300 కోట్లు అప్పుల చెల్లింపునకు, రూ.203 కోట్లు నిర్మాణ పరికరాల కొనుగోలుకు, రూ.174.2 కోట్లు ఇతర బకాయిల చెల్లింపునకు వాడుతుంది.
ఈ కంపెనీ రహదారులు, వంతెనలు, రైల్వే, సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తుంది. ఈఎస్డీఎస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ రూ.600 కోట్లు సేకరిస్తుంది. ఈ కంపెనీ గతంలో 2021 సెప్టెంబర్ నెలలో కూడా ప్రయత్నించి ఇది రెండోసారి పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. సేకరించిన నిధులలో రూ.480.7 కోట్లు క్లౌడ్ కంప్యూటింగ్ పరికరాలు, డేటా సెంటర్ల మౌలిక సదుపాయాల కోసం వినియోగిస్తామని కంపెనీ ప్రకటించింది.
బీఎల్ఎస్ పాలిమర్స్ 1.7 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేస్తుంది. ఇది టెలికం, విద్యుత్, రైల్వే, చమురు రంగాలకు అవసరమైన పాలిమర్ కాంపౌండ్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ మూడు కంపెనీలూ బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లలో లిస్టవుతాయి.
