ఇన్నోవేటివ్ ఆలోచనలతో పెరిగిపోతున్న స్టార్టప్స్

ఇన్నోవేటివ్ ఆలోచనలతో పెరిగిపోతున్న స్టార్టప్స్
  •     ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ ​కలిసి బడ్జెట్​ బిజినెస్
  •     చిన్న స్పేస్​లో ఆఫీసులు.. సోషల్ ప్లాట్‌‌‌‌ఫాంలతో ప్రమోషన్

హైదరాబాద్, వెలుగు: ఒక వైపు జాబ్​ చేస్తూనే మరోవైపు ఏదో ఒక బిజినెస్​ స్టార్ట్​ చేసేవాళ్లు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఒకప్పుడు బిజినెస్ అంటే రిస్క్‌‌‌‌ తో కూడుకున్న పని.. మనకు ఎందుకులే అనుకునేవారు. ఇప్పుడు యూత్ ​ఆలోచన మారింది. నెల శాలరీతోపాటు అదనంగా సంపాదించాలని తమకు నచ్చిన బిజినెస్ మొదలుపెడుతున్నారు. అందరిలా కాకుండా క్రియేటివిటీ, ఇన్నోవేటివ్ ఆలోచనలతో ట్రెండీగా ఉండేలా చూసుకుంటున్నారు. తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉండేలా ప్లాన్​ చేస్తున్నారు. ఒకేసారి పెద్దమొత్తంలో కాకుండా చిన్న రూమ్​ను అద్దెకు తీసుకుని ఆఫీస్​ పెడుతున్నారు. సోషల్ మీడియాను బిజినెస్ అడ్డాలుగా మార్చుకుంటున్నారు. ఆయా సోషల్​యాప్స్ ​ద్వారా ప్రమోషన్స్ ​చేసుకుంటూ బిజినెస్ చేసేస్తున్నారు. 

తక్కువ బడ్జెట్​తో సరికొత్తగా..

గతంలో నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ కలిస్తే ఉద్యోగాలు, ఆఫీసుల ముచ్చట్లలో మునిగితేలేవారు. ఇప్పుడు స్టార్టప్ ఐడియాల గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు. ఇలా ఇప్పటికే సిటీలో ఎన్నో ట్రావెల్, క్లాత్స్, ఫుడ్, గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్, లైవ్ మ్యూజిక్ బాండ్స్ వంటి పలు  కొత్త కొత్త స్టార్టప్​లు మొదలై సక్సెస్​ఫుల్​గా నడుస్తున్నాయి. వీటిని రన్​ చేస్తున్న వారిలో చాలా వరకు ఎంఎన్‌‌‌‌సీలలో పనిచేస్తున్న వారు ఉంటున్నారు. ఓ వైపు జాబ్​చేస్తూనే స్టార్టప్‌‌‌‌లతో మార్కెట్‌‌‌‌లో తమకంటూ ఓ ఇమేజ్​ని క్రియేట్ చేసుకుంటున్నారు. తక్కువ ఇన్వెస్ట్​ మెంట్​తో బిజినెస్ ​మొదలుపెడుతున్న వారు అధికంగా ఉంటున్నారు. కొందరు నాలుగైదు వేలతో స్టార్ట్ చేస్తే, మరికొందరు 40 నుంచి 50 వేలతో మొదలుపెడుతున్నారు. ఇంకొందరు లక్ష పైగా పెట్టుబడితో బొటిక్, ఈవెంట్ మేనేజ్​మెంట్, ఫుడ్ బిజినెస్‌‌‌‌లు స్టార్ట్ చేస్తున్నారు.

అన్ని రకాల రంగాల్లో.. 

కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్న వారు ఏ టు జెడ్ సర్వీసులపై దృష్టి పెడుతున్నారు. జువెలరీ, యాక్ససరీస్, క్లాత్స్, కిచెన్ వేర్, గ్రాసరీ, డ్రై ఫ్రూట్స్, ఇంటీరియర్ డెకరేటివ్ ఐటమ్స్, ప్లాంట్స్, ఫుడ్, ఇల్లు, కమర్షియల్ స్పేస్​లకు అవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువులు, గ్యాడ్జెట్స్, స్పేర్ పార్ట్స్, ట్రావెలింగ్ ఇలా విభిన్న రకాల వ్యాపారులు చేస్తున్నారు. నలుగురైదురు ఐటీ ఉద్యోగులు గ్రూప్‌‌‌‌లుగా మారి రాక్ బాండ్ స్టార్టప్‌‌‌‌లను మొదలుపెడుతున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉద్యోగాలు చేసి వారాంతరాల్లో ఓల్డ్, హిట్ మెలోడిస్ ని పాడుతూ సెషన్లు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జాబ్‌‌‌‌ చేస్తూ సాయంత్రాల నుంచి అర్ధరాత్రుల వరకు సిటీలోని కెఫేలు, రెస్టారెంట్లలో లైవ్ మ్యూజిక్ నిర్వహిస్తున్నవారు కూడా అధికంగా ఉంటున్నారు. ప్రస్తుతం ట్రావెల్ స్టార్టప్‌‌‌‌ల ట్రెండ్ ఎక్కువైంది. యూత్ ఈ రంగంలోకి దిగి తమ వినూత్నమైన ఆలోచనతో టూర్లను డిఫరెంట్‌‌‌‌గా ప్లాన్ చేస్తున్నారు. టూరిజం హోటల్స్, రిసార్ట్స్ తో, ట్రావెలర్స్ తో టైఅప్ అయి సిటీ నుంచి ట్రావెలర్లను వెంటబెట్టుకుని తీసుకెళ్తున్నారు. 

ప్రతి వీకెండ్ ఒక ట్రిప్

మేము ట్రిప్​టిన్ అడ్వెంచర్స్​ను 2019లో స్టార్ట్ చేశాం. గతంలో కంటే లాక్​డౌన్ తర్వాత ట్రావెలింగ్ చేసేవాళ్ల సంఖ్య పెరిగింది. దీంతో ప్రతి సీజన్​కి ఏదో ఒక యూనిక్ నేమ్ ప్యాకేజీలు అందుబాటులో ఉంచుతున్నాం. ప్రతి వీకెండ్ 10 నుంచి 15 మందితో ఒక గ్రూప్‌‌‌‌ క్రియేట్ చేసి ట్రిప్పుకు తీసుకెళ్తున్నాం. టూర్‌‌‌‌‌‌‌‌ ప్లేస్​లోని హోటల్స్, రీసార్టులలో కాకుండా హోం స్టేలు ఏర్పాటు చేస్తున్నాం. అక్కడి కల్చర్, ఫుడ్ ట్రావెలర్లకు మంచి ఎక్స్​పీరియన్స్ ఇస్తోంది. ట్రెక్కింగ్, కోటలు, వాటర్‌‌‌‌‌‌‌‌ఫాల్స్ ఉన్న ప్లేసులను జనం ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రతి ట్రిప్​లో అవి ఉండేలా చూసుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో ట్రావెల్ స్టార్టప్​లు పెరుగుతున్నాయి. కాంపిటీషన్ ఎక్కువైంది. - కార్తీక్, కో ఫౌండర్, ట్రిప్ టిన్ 

ఉద్యోగం చేస్తూనే బ్యాండ్​ నడుపుతున్నం

నేను నా ఫ్రెండ్స్ ఐదుగురం కలిసి ‘సెప్టెంబర్ బాయ్స్’ పేరుతో లైవ్ మ్యూజిక్ బాండ్​ని 2018లో స్టార్ట్​చేశాం. అందరం జాబ్స్ చేస్తూనే మ్యూజిక్ పై ఉన్న ఇంట్రెస్ట్ ని కంటిన్యూ చేస్తున్నాం. ఇన్‌‌‌‌స్టాగ్రామ్ పేజీ ద్వారా, మా లైవ్ మ్యూజిక్ సెషన్​లో పార్టిసిపేట్ చేసిన వాళ్ల ద్వారా బుకింగ్స్ వస్తుంటాయి. కెఫేలు, బిస్ట్రోలతోపాటు ఈవెంట్ మేనేజర్ల ద్వారా వచ్చిన ప్రోగ్రామ్​లలో లైవ్ సింగింగ్ చేస్తున్నాం. మా సాంగ్స్ విన్నవారు మళ్లీ మళ్లీ వస్తుంటారు. ఇటీవల డైలీ ప్రోగ్రామ్స్​ కోసం స్లాట్ బుకింగ్స్ అవుతున్నాయి. మా గ్రూప్‌‌‌‌లో సింగర్, గిటారిస్ట్, కీబోర్డ్ ప్లేయర్, మ్యూజిషియన్లు ఉన్నారు.
- శరత్, గిటారిస్ట్, 
సెప్టెంబర్ బాయ్స్ లైవ్ మ్యూజిక్ బాండ్

టీ స్టాల్ పెట్టాలని చూస్తున్నాం

ఇటీవల కాలంలో జాబ్ చేస్తూనే స్టార్టప్​లు పెడుతున్న వారిని చాలా మందిని చూశాను. జాబ్​ మీదనే డిపెండ్ ​అయితే ఫ్యూచర్​ ఎలా ఉంటుందో తెలియడం లేదు. అందుకే బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నా. నా ఫ్రెండ్​తో కలిసి టీ స్టాల్ పెట్టాలని అనుకుంటున్నా. ఇప్పటికే పలు రకాల బ్రాండ్ల ఓనర్లతో మాట్లాడాం. మంచి అడ్డా చూసుకుని త్వరలోనే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. 
- సుబ్రహ్మణ్యం, ఐటీ ఎంప్లాయ్, మణికొండ