కేసీఆర్ మోసాలకు ఈ బడ్జెట్ నిదర్శనం

కేసీఆర్ మోసాలకు ఈ బడ్జెట్ నిదర్శనం

రాష్ర్టంలో ఆర్థిక మాంద్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ దోపిడీయే కారణమని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక మందగమనం అంటూ ఏమీ లేదని, ఉన్నదల్లా కేసీఆర్ మందగమనమే అని ఎద్దేవా చేశారు. వాస్తవాలకు దూరమైన బడ్జెట్ ప్రవేశపెట్టారని, కేసీఆర్ మోసాలకు, అబద్ధాలకు బడ్జెట్ నిదర్శనమన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్ లో రూ.25 వేల కోట్ల నుంచి రూ.11 వేల కోట్లకు కేటాయింపులు తగ్గించారు. కావాల్సిన కమీషన్లు ముట్టడంతోనే ఇలా చేశారు. ప్రాజెక్టులపై కేసీఆర్ కు మోజు తగ్గిందనడానికి బడ్జెట్ లో కేటాయింపులే నిదర్శనం’’ అని ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అరకొర నిధులు కేటాయించడం ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ లకు అన్యాయం చేయడం కాదా అని ప్రశ్నించారు.

12 బీసీ ఫెడరేషన్లకు పైసా కూడా ఇయ్యలే

రాష్ట్రంలోని 12 బీసీ ఫెడరేషన్లకు ఈ బడ్జెట్ లో ఒక్క పైసా కూడా కేటాయించలేదని, ఇదేనా బీసీ సంక్షేమ ప్రభుత్వం అంటే అని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ దృష్టిలో ఎన్నికల మేనిఫెస్టో అంటే ప్రజల బతుకులను నిలబెట్టడమా? లేక బ్యాలెట్ బాక్స్ లను నింపుకోవడమా? అని నిలదీశారు. కేజీ టు పీజీ ఉచిత విద్య, ఫీజు రీయంబర్స్ మెంట్ ఏమయ్యాయని, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎప్పుడిస్తారని, ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు, పీఆర్సీ సంగతి ఏమైందని ప్రశ్నించారు. విద్య కోసం కేటాయించిన రూ.10 వేల కోట్లలో 90 శాతం నిధులు ఉద్యోగుల జీతాలకే ఖర్చవుతున్నాయన్నారు. మిషన్ భగీరథ కింద రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని పట్టణాలకు, ఎన్ని గ్రామాలకు నీరందిస్తున్నారో చెప్పలేదని లక్ష్మణ్ అన్నారు.

ఆత్మస్తుతి, పరనింద

కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న నిధులు, సహకారం గురించి బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం, పైగా కేంద్రాన్ని నిందించడం కేసీఆర్ ఆత్మస్తుతి, పరనిందకు పరాకాష్ట అని లక్ష్మణ్ మండిపడ్డారు. నిరంతర విద్యుత్, రైల్వేలు, జాతీయ రహదారులు, గ్రామీణ, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం అందిస్తున్న నిధులు, సహకారంపై సీఎం మాట కూడా మాట్లాడకపోవడం విచారకరమన్నారు. నిరుద్యోగ భృతి, కొలువులు, ఉద్యోగుల పీఆర్సీ విషయంలో యువతను, ఉద్యోగులను మోసం చేస్తున్న టీఆర్ఎస్ సర్కార్ తీరును నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో అన్ని యూనివర్సిటీలు, విద్యా సంస్థల స్టూడెంట్లతో కలిసి త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడుతామని లక్ష్మణ్ హెచ్చరించారు.

అప్పుల ఊబిలోకి నెట్టేయడమే

రూ.35 వేల కోట్ల అప్పులు చేస్తామని బడ్జెట్ లో చెప్పడం అంటే.. ఈ రాష్ట్రాన్ని  పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేయడమేనని లక్ష్మణ్ విమర్శించారు. తలసరి ఆదాయం రూ.2,28,216 అని చెప్పిన ప్రభుత్వం, తలసరి అప్పు 91వేలు ఉన్న విషయం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. 2014లో రూ.70 వేల కోట్లు ఉన్న రాష్ట్ర అప్పు, 2020 వచ్చే సరికి రూ.2 లక్షల 30 వేల కోట్లకు చేరిందన్నారు. హైదరాబాద్ సిటీకి రూ.10 వేల కోట్లు కేటాయించినంత మాత్రాన ఇక్కడి ప్రజలు కేసీఆర్ ను, మజ్లిస్ ను నమ్మరని లక్ష్మణ్ అన్నారు. సిటీలో గుంతలున్న రోడ్లను చూపిస్తే 10 వేలు ఇస్తామని మున్సిపల్ మంత్రి కేటీఆర్ గతంలో చెప్పిన విషయాన్ని లక్ష్మణ్ ప్రస్తావిస్తూ.. గుంతలు లేని రోడ్లను చూపిస్తే తాము రూ.లక్ష ఇస్తామని సవాల్ చేశారు. కరోనాపై అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడిన తీరు శంకర్ దాదా ఎంబీబీఎస్ మాదిరి ఉందన్నారు. అసెంబ్లీకి మాస్క్ లు లేకుండా వచ్చినంత మాత్రాన కరోనా వ్యాధి లేన్నట్లా అని ప్రశ్నించారు.