ఈ ఐదేళ్ల కాలానికి రూ.2 లక్షల రైతు రుణమాఫీ: సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

ఈ ఐదేళ్ల కాలానికి రూ.2 లక్షల రైతు రుణమాఫీ: సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

తెలంగాణలో రైతు రుణమాఫీపై రాష్ట్రం క్యాబినెట్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం భేటి అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పినట్లు రూ.2లక్షల రుణమాఫీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8నెలల్లోనే అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఐదు సంవత్సరాల మధ్య కాలంలో రాష్ట్రంలో రైతులు తీసుకున్న రుణాల్లో.. 2 లక్షల రూపాయల వరకు రుణామాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

వ్యవసాయం దండగ కాదు.. పండగలా అనుకునే విధంగా సాగు రంగాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. ఒకే విడతలో మొత్తం రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. గత  ప్రభుత్వం రెండుసార్లు రూ.21వేల కోట్లు రుణమాఫీ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కటాఫ్ డేట్ 2018 డిసెంబర్ 11గా తీసుకుంది. అప్పటి నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తుందని సీఎం ప్రకటించారు.

2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్యకాలంలో తీసుకున్న పంట రుణాలను రూ.2లక్షల లోపు మాఫీ చేయనున్నారు.  ఐదేళ్ల (2018 నుంచి 2023)లో తీసుకున్న క్రాఫ్ లోన్లను మాఫీ చేయడానికి రూ.31వేల కోట్లు అవసరమని ఆయన అన్నారు.  

రైతు భరోసాపై మంత్రి వర్గ కమిటీ

రైతు భరోసా పథకాన్ని పారదర్శకంగా అందించటానికి మంత్రి వర్గ ఉప సంఘం నియామకం చేస్తామన్నారు. ఈ సంఘనాకి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నాయకత్వం ఉండి.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి శ్రీథర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసు రెడ్డిలు కమిటీలో సభ్యులుగా ఉండనున్నారని సీఎం తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సభలో చర్చించి.. నిర్ణయం తీసుకుని, జూలై 15వ తేదీలోపు నివేదిక అందిస్తామన్నారు.