రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సాయంతో రైతుకు ఇమ్మతి

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సాయంతో రైతుకు ఇమ్మతి
  • ఎకరం భూమి ఉంటే ఏడాదికి రూ.16 వేలు
  • రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.10 వేలు.. కేంద్రం నుంచి 6 వేలు
  • 54 లక్షల మందికి రైతుబంధు, పీఎం కిసాన్‌‌ స్కీంతో ఊరట
  • సన్న, చిన్నకారు రైతులకు తప్పనున్న పెట్టుబడి తిప్పలు
  • పీఎం కిసాన్‌‌ కింద ఇప్పటికే రెండు విడతల సాయం
  • రైతుబంధు కింద రూ.5 వేలు అందించేందుకు రంగం సిద్ధం

అప్పుల సాగు చేయలేక అవస్థలు పడుతున్న రాష్ట్ర రైతులకు ఊరట లభించనుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎకరానికి ఏటా రూ.16 వేల సాయం అందనుంది. రాష్ట్ర సర్కారు ప్రవేశపెట్టిన రైతుబంధు ద్వారా ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండు సీజన్‌‌లకు కలిపి రూ.10 వేలు, కేంద్రం నుంచి రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా రూ.6 వేలు అందనున్నాయి. ఇలా ఏటా రూ.16 వేలు రైతు అకౌంట్‌‌లో జమ కానున్నాయి. దీంతో పంట వేసే టైంలో చేతిలో పైసల్లేక, అప్పులు పుట్టక ఇబ్బందులు పడే చిన్న, సన్నకారు రైతుల కష్టాలు తీరనున్నాయి. పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులు, ఫైనాన్స్‌‌ కంపెనీల చుట్టూ తిరిగే బాధలు కొద్దిగా తప్పనున్నాయి.

రెండు స్కీంలతో అందింది ఎంత?

రైతుబంధు పథకం కింద గత ఆర్థిక సంవత్సరం (2018–19)లో రైతులకు రెండు విడతలుగా రూ.8 వేల సాయం అందింది. వానాకాలంలో 51.50 లక్షల మందికి రూ.5,260.94 కోట్లను చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. యాసంగిలో 49.03 లక్షల మంది రైతులకు రూ.5,244.26 కోట్లు అందజేశారు. రెండు పంటలకు కలిపి రూ.10,505 కోట్లు రైతుల ఖాతాలో జమచేశారు. ప్రస్తుత సీజన్‌‌లో రూ.5 వేల చొప్పున 54.50 లక్షల మందికి పెట్టుబడి సాయం అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పీఎం కిసాన్‌ స్కీం కింద ఇప్పటికే రెండు విడుతలుగా రూ.4 వేలు అందజేశారు. రాష్ట్రంలో మొదటి విడత కింద 18.47 లక్షల మంది రైతులకు రూ.369.40 కోట్లు, రెండో విడత కింద 18.58 లక్షల రైతులకు రూ.370.16 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఎన్నికల కోడ్‌ ఎత్తేసిన నేపథ్యంలో మూడో విడత జమ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

పీఎం కిసాన్‌ పథకానికి సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో లబ్ధిదారులు సంఖ్య పెరగనుంది. రైతుబంధు తరహాలో 54 లక్షల మందికి వర్తింపజేస్తారా లేదా కేంద్రం ఇంకేమైనా పరిమితులు విధిస్తుందా అన్నది స్పష్టం కాలేదు. ఒకవేళ రైతులందరికీ వర్తింపజేస్తే ఈ సీజన్‌కు రైతుబంధు సాయం కింద  ఇచ్చే రూ.5 వేలతోపాటు పీఎం కిసాన్‌ ద్వారా రూ.2 వేలు అందుతాయి.

పెరగనున్న దిగుబడులు

పెట్టుబడులకు రైతుల చేతిలో డబ్బు ఉండడంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. రాష్ట్రంలో వరి సాధారణ సాగు 23.75 లక్షలు కాగా గత ఖరీఫ్‌లో 26.38 లక్షల ఎకరాల్లో సాగైంది. అంటే సాధారణం కంటే 2 లక్షల ఎకరాల్లో అదనంగా సాగైంది. ఈ ఖరీఫ్‌లో ఇది మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పత్తి సాగు కూడా పెరిగింది. సాధారణంగా ఖరీఫ్‌లో 42 లక్షల ఎకరాల్లో ఇది సాగవుతుంది. గత ఖరీఫ్‌లో 44 లక్షలకు పెరిగింది. ఈ ఖరీఫ్‌లో 50 లక్షల ఎకరాలకు చేరుతుందని అధికారులు అంటున్నారు. మొక్కజొన్న, జొన్న, పసుపు, మిర్చి, వేరుశనగ, కంది, పెసర వంటి దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

మన రైతులకే ఎక్కువ!

కిందటేడాది మే 10న సీఎం కేసీఆర్‌‌ రైతుబంధు స్కీంను ప్రకటించారు. ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండు సీజన్‌‌లకు కలిపి రూ.8 వేలు ఇస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మరో వెయ్యి పెంచుతూ ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ పెంచిన మొత్తాన్ని అందించేందుకు ప్రభుత్వం శనివారం జీవో కూడా జారీ చేసింది. రాష్ట్రంలోని రైతుబంధు తరహాలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రధాని మోడీ కూడా పీఎం కిసాన్‌‌ సమ్మాన్‌‌ స్కీం తెచ్చారు. దీనికింద ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6 వేలు ఇస్తామన్నారు. తాజాగా ఆ ఐదెకరాల సీలింగ్‌‌ కూడా ఎత్తివేసి దేశంలోని రైతులందరికీ సాయం అందిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ లెక్కన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.10 వేలు, కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కలిపి ఏటా రూ.16 వేలు అందనుంది. ఈ రెండు స్కీంలతో దేశంలో మన రైతుల ఖాతాల్లోనే ఎక్కువ పైసలు జమ కానున్నాయి.

చిన్న, సన్నకారు రైతులకే మేలు

రైతుబంధుతో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ సంఖ్యలో లబ్ధి పొందుతున్నారు. రాష్ట్రంలోని 54.50 లక్షల మంది రైతుల్లో ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 47.08 లక్షలు. ఇందులో 0–1 ఎకరాలు ఉన్న రైతులు14.86 లక్షల మంది ఉన్నారు. ఈ స్కీంలతోపాటు మద్దతు ధర, కౌలు రైతులు, పంట బీమా లాంటి ఇతర సమస్యలపైనా దృష్టి సారించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

‘రైతు బంధు’ ప్రాణం పోసింది

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దశాబ్దాలు గాదేశంలో ప్రభుత్వాలు రైతును గుర్తించ లేదు.తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రైతులపై అనేక పథకాలు తెచ్చారు. రైతుబంధు స్కీం రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రాణం పోసింది.దీని స్పూర్తితోనే కేంద్రం పీఎం కిసాన్ స్కీం తెచ్చింది. – సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ మంత్రి

దేశానికే ఆదర్శం

రైతు బంధు దేశానికే ఆదర్శం . రైతులకు ప్రైవేటు అప్పుల బారినుంచి విముక్తి కలిగించింది. దాంతో వ్యవసాయం మానేసిన వాళ్లు కూడా తిరిగి సాగుచేస్తున్నారు. చిన్న కమతాలున్న వాళ్లకు పెట్టు బడిసాయంగా రైతుబంధు ఆదుకుంటోంది. కేంద్రం ఏటా రూ.6 వేలే ఇస్తుంటే మనం ఎకరాకు పదివేలిస్తున్నం .- గుత్తా సుఖేందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు

అప్పుల బాధ తప్పింది

వాన పడ్డదంటే విత్తనాలు , ఎరువులు తెచ్చుకోవడానికి పైసలు మిత్తికి తెచ్చుకోవాల్సి ఉండేది. రైతుబంధుతో అప్పుల బాధ తప్పింది. దానికి నాలుగు పైసలు కలుపుకుని చేస్తున్నాం. పైసలు కూడా బ్రోకర్లు లేకుంట డైరెక్టు బ్యాంకుల పడుతున్నయి .చెక్కుల కంటే ఆన్ లైనే బాగున్నది.-బీరయ్య, ఆలేరు

కౌలు రైతుకేది?

రైతు బంధు పథకం మంచి దే. ఒకట్రెండు ఎకరా-లున్న రైతులందరికీ ఎంతో మేలు జేసింది. కానీపదుల ఎకరాలున్న ఆసాము లెవరూ సాగు చేస్తలే-రు. వాళ్లకొచ్చే రైతు బంధు పైసల్ల మాలాంటి కౌలురైతుకు రూపాయి కూడా ఇస్తలేరు. మా గురించికూడా ప్రభుత్వం ఆలోచనజేయాలె.- ఓదెలు, రామగిరి , పెద్దపల్లి జిల్లా

సమయానికి అందిస్తున్నాం

పెట్టు బడి సాయం సకాలంలో అందిస్తున్నాం.అప్పులు తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండారైతు బంధు ఆదుకుంటోం ది. పీఎం కిసాన్‌ కొత్తమార్గదర్శకాలు రాలేదు. ప్రభుత్వోద్యో గులను,ఐటీ కట్టేవారిని గతంలో పక్కన పెట్టారు. ఈసారిమార్గదర్శకాలను బట్టి లబ్ధిదారులను గుర్తిస్తాం.- పార్థసారథి,వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి