లోక్​సభ ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగ

లోక్​సభ ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగ
  • ప్రతిఒక్కరూ బాధ్యతగా ఓటేయాలి
  • రాష్ట్ర సీఈఓ వికాస్ రాజ్
  • సీఈఓ, డీజీపీ ఇండ్లకు వెళ్లి ఓటరు స్లిప్పులు అందజేసిన జీహెచ్ఎంసీ కమిషనర్ 

హైదరాబాద్, వెలుగు : మే13న ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు వేయడం బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర సీఈఓ వికాస్ రాజ్ సూచించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ​రోనాల్డ్​రోస్​శనివారం ఉదయం ఎస్ఆర్ నగర్ లోని సీఈఓ వికాజ్​రాజ్ ఇంటికి వెళ్లి ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్, పోలింగ్ తేదీతోపాటు ఓటరుగా గర్వ పడుతున్నాను అని ఉన్న స్టిక్కర్ ను అందజేశారు. ఈ సందర్భంగా సీఈఓ వికాస్ రాజ్ మాట్లాడుతూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేయాలన్నారు.

దేశ భవిష్యత్తుకు ఓటు ఒక ఆయుధం లాంటిదని, మే13న జరిగే ఓటింగ్​ను ప్రజాస్వామ్య పండుగగా భావించాలని చెప్పారు. ఎపిక్ కార్డు ఉంటే సరిపోదని, ఓటరు లిస్టులో పేరు ఉందో.. లేదో సరి చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ రోనాల్డ్​రోస్​ఇంటింటికీ ఓటర్ స్లీప్, స్టిక్కర్ పంపిణీ కార్యక్రమాల వివరాలను సీఈఓకు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ స్లిప్పులు పంపిణీ చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. అంతకు ముందు అధికారులతో కలిసి కమిషనర్ ​రోనాల్డ్​రోస్​ డీజీపీ రవిగుప్తా ఇంటికి వెళ్లి ఓటర్ స్లిప్, స్టిక్కర్ అందజేశారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. పోలింగ్​కు అన్ని పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కమిషనర్ వెంట ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బి.హేమంత్ సహదేవ్ రావు, జూబ్లీహిల్స్, బేగంపేట డిప్యూటీ కమిషనర్లు ప్రశాంతి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.