- ప్రతి పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలి
- స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి
హనుమకొండ, వెలుగు: ఎస్ఐఆర్ లో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో 'సర్' పురోగతిపై బిహార్ అడిషనల్ సీఈవో ప్రశాంత్ కుమార్ తో కలిసి రివ్యూ చేశారు. బిహార్ స్టేట్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎదురైన సవాళ్లు, వాటిని ఎలా అధిగమించారనే అంశాలను ప్రశాంత్ కుమార్ వివరించారు. అనంతరం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అర్బన్ ఏరియాల్లో మున్సిపల్ బిల్ కలెక్టర్లు, బూత్ లెవెల్ ఆఫీసర్లు సమన్వయంతో మ్యాపింగ్ చేయాలన్నారు. హనుమకొండ జిల్లా పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే 64.88 శాతం పూర్తయిందని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ వివరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్రవి, సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేశ్, నారాయణ, ఇతర ఆఫీసర్లు పాల్గొన్నారు.
మ్యాపింగ్ కు రాజకీయ పార్టీలు సహకరించాలి..
త్వరలోనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని, దీనికి రాజకీయ పార్టీలు సహకరించాలని సుదర్శన్ రెడ్డి కోరారు. హనుమకొండ సుబేదారి రెడ్ క్రాస్ సమీపంలో కొత్తగా నిర్మించిన ఈవీఎం, వీవీ ప్యాట్ గోదాంను ఆయన ప్రారంభించారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రతి పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు. వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ఏమైనా సమస్యలుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు.
