- అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు: సీఎస్ శాంతికుమారి
హైదరాబాద్, వెలుగు : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల12న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సుమారు లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళలతో రాష్ట్ర మహిళా సదస్సును నిర్వహించనున్నామని సీఎస్ శాంతికుమారి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో మహిళా సదస్సు ఏర్పాట్లపై టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులు పెద్దసంఖ్యలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు, పార్కింగ్, హాజరయ్యే మహిళలకు సౌకర్యాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ రవి గుప్తా, పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్ అండ్ బీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
