గ్రామ పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. నవంబర్ 25న సాయంత్రం 6 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నిలకు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. డిసెంబర్ సెకండ్ వీక్ లో ఎన్నికలు జరగనుండగా.. మూడు విడుతల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారయ్యాయి. జిల్లాల వారీగా రిజర్వేషన్ల గెజిట్లు పంచాయతీరాజ్‌శాఖ కమిషనరేట్‌కు సోమవారం మధ్యాహ్నం చేరుకున్నాయి. 31 జిల్లాల నుంచి మూడుసెట్ల గెజిట్లు జిరాక్స్ కాపీలతోపాటు పెన్‌డ్రైవ్‌లో తీసుకొని కమిషనరేట్‌లోని హెల్ప్ డెస్క్‌లో డీపీవోలు అందజేశారు. వీటిని పీఆర్ ఆఫీసర్లు పరిశీలించి, ఆ తర్వాత జిల్లాల వారీగా ఒక్కో సెట్ గెజిట్ కాపీలను రాష్ట్ర ఎన్నికల సంఘాని(ఎస్ఈసీ)కి అప్పగించారు. మరో సెట్ గెజిట్ కాపీలను సీఎస్ రామకృష్ణకు పంపించారు. దీంతో ఎన్నికల నిర్వహణ సంబంధించిన అంశం ఇక ఎస్ఈసీ చేతుల్లోకి వెళ్లింది.
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రిజర్వేషన్ల జాబితా కూడా చేతికి రావడంతో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ అయ్యింది.
