
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గం తెలిపింది. ‘‘రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలను బీఆర్‌ఎస్ మోసం చేసింది. ఆరు దశాబ్దాల పాటు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఆయా వర్గాలను ఓటు బ్యాంకుగానే చూసింది. కానీ మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ, అంబేద్కర్ ఆశయాలను సాకారం చేస్తోంది” అని చెప్పింది. పేదల సంక్షేమం, దేశ భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు పలు అంశాలను ప్రస్తావించారు. ‘‘మొదట దళితుడినే సీఎం చేస్తానన్న కేసీఆర్.. ఆ తర్వాత మాట తప్పి, దళిత ద్రోహిగా మారారు. దళితులందరికీ మూడెకరాల భూమి ఇస్తానని ఇయ్యలేదు. రాజ్యాంగంపై కామెంట్లు చేసి అంబేద్కర్ నే అవమానించారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానని, గిరిజన బంధు, పోడు పట్టాలిస్తానని ఇయ్యలేదు” అని మండిపడ్డారు. ‘‘ఈ ఎనిమిదిన్నరేండ్లలో బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అణచివేతకు గురయ్యారు. కేసీఆర్ సర్కార్ బీసీలకు సరైన అవకాశాలు ఇవ్వలేదు” అని ఫైర్ అయ్యారు.