దుబ్బాక పాయే.. జీహెచ్ఎంసీ వచ్చే.. అయినా పీఆర్సీ రాకపాయే

దుబ్బాక పాయే.. జీహెచ్ఎంసీ వచ్చే.. అయినా పీఆర్సీ రాకపాయే

తమకు రెండు దఫాల డీఏలు, పీఆర్సీలు పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో జరిగిన దుబ్బాక ఎన్నిక ముందు సీఎం కేసీఆర్ పీఆర్సీ గురించి ఏమైనా ప్రకటిస్తారేమోనని ఉద్యోగులు గంపెడాశతో ఎదురుచూశారు. కానీ ఆ సమయంలో ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఆ తర్వాత తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల సమయంలోనైనా తమ పీఆర్సీ గురించి ప్రకటిస్తారేమోనని ఉద్యోగులు ఆశగా ఎదురుచూశారు. అయితే గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఉద్యోగులకు మళ్లీ నిరాశే ఎదురైంది. దాంతో ఉద్యోగులు ఈ సారి ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నారు. అందుకే ప్రభుత్వం జిల్లాల ఉద్యోగులను గ్రేటర్ ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని ఆలోచిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2018 జూలై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీకి ఇప్పటికీ మోక్షం కలగలేదు. ఉద్యోగులకు సంబంధించి రెండు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి, మరొకటి జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు వాటి ఊసే ఎత్తడం లేదు. ఇది చాలనదన్నట్లు కరోనా కాలంలో దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలోనే ఉద్యోగుల వేతనాల్లో కోతను అమలు చేశారు. ఈ కోతను ఏకంగా మూడు నెలలపాటు కొనసాగించారు. అయితే ఉద్యోగులు కోర్టుకెక్కడంతో.. హైకోర్టు తీర్పుతో తిరిగి చెల్లించారు.

నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డీఏలు, పీఆర్సీ ప్రయోజనాలు సకాలంలో అందకపోవటంతో ఉద్యోగులంతా ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల హైదరాబాద్‌ వరద బాధితులను ఆదుకోవటానికి ఒకరోజు వేతనం విరాళంగా ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయిస్తే.. ఆ నిర్ణయాన్ని చాలామంది ఉద్యోగులు వ్యతిరేకించారు. దీనికి కారణం డీఏలు, పీఆర్సీలు లేకపోవడమే. అయినా కూడా ఉద్యోగ సంఘాల నేతలు ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించి.. సీఎం కేసీఆర్‌ను కలిసి అందజేశారు. ఆ సమయంలో సీఎం కేసీఆర్ త్వరలోనే సమావేశమై ఉద్యోగుల సమస్యలపై మాట్లాడదామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మళ్లీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

For More News..

రాష్ట్రంలో కొత్తగా మరో 925 కరోనా కేసులు

ఫోన్ వాడొద్దన్నందుకు.. ఉరి వేసుకుంది

టీఆర్ఎస్‌లో రెబల్స్ లొల్లి