ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర సర్కార్ ఫెయిల్ : హరీశ్రావు

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర సర్కార్ ఫెయిల్ : హరీశ్రావు
  • సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరగడం మాని రైతుల కష్టాలు తీర్చండి: హరీశ్​రావు

సిద్దిపేట రూరల్, వెలుగు: మార్కెట్లలో ధాన్యం అమ్ముకునేందుకు రైతులు పడిగాపులు కాస్తున్నారని బీఆర్ఎస్​డిప్యూటీ ఫ్లోర్​ లీడర్​, మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. సీఎం రేవంత్​రెడ్డికి ఢిల్లీ చుట్టూ తిరగడమే సరిపోతుందని, రైతుల గోస పట్టడంలేదని విమర్శించారు. మంగళవారం సిద్దిపేట రూరల్ మండలం బండచెర్లపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనకపోవడంతో 40 రోజులుగా మార్కెట్లోనే రైతులు అవస్థలు పడుతున్నారన్నారు.  ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఇప్పటికైనా వేగం పెంచాలని డిమాండ్​చేశారు.  

మక్కజొన్న, సన్‌‌ఫ్లవర్, శనగలు అమ్మిన రైతులకు ఇప్పటివరకు డబ్బులు చెల్లించలేదని, వడ్లు  తరలించేందుకు లారీల కొరత తీవ్రంగా ఉందని ఆరోపించారు. ఆర్టీఏ అధికారులు, వెహికల్ ఇన్‌‌స్పెక్టర్లకు బాధ్యతలు అప్పగించి ఖాళీగా వెళ్లే వాహనాలను  ధాన్యం తరలించేందుకు మళ్లించాలన్నారు.  వర్షాలతో  ధాన్యం తడిచిపోకముందే కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు.   మార్చి 22న సిద్దిపేటలో సరిగిన సభలో  45 రోజుల్లో రైతుబంధు డబ్బులు వేస్తామని సీఎం హామీ ఇచ్చారని,   52 రోజులు దాటినా డబ్బులు జమ కాలేదని విమర్శించారు.  అనంతరం  చింతమడక,  రంగధాంపల్లి,  పుల్లూరులలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.