హైదరాబాద్, వెలుగు: వరంగల్ మామునూరు ఎయిర్పోర్టు అభివృద్ధి కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. రాష్ట్ర సర్కారు సేకరించిన 300 ఎకరాల భూములను గురువారం బేగంపేట్ విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారికంగా అప్పగించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. మామునూరు ఎయిర్పోర్ట్ కోసం కేంద్ర విమానయాన శాఖకు అధికారికంగా భూమి అప్పగించడం చరిత్రలో నిలిచిపోయే రోజని తెలిపారు.
‘‘2007లోనే ఎయిర్ పోర్ట్ అథారిటీతో మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ఒప్పందం జరిగింది. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ దీన్ని పట్టించుకోలేదు. రాష్ట్రంలోని టూ టైర్ సిటీలు అయిన కొత్తగూడెం, ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు నిర్మించాలని కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రామ్మోహన్ నాయుడును స్టేట్ కేబినెట్ కోరింది. ఆయన సానుకూలంగా స్పందించారు. భూ సేకరణకు రూ.300 కోట్లు అవసరమని గుర్తించి వాటిని వెంటనే విడుదల చేసి ప్రక్రియను పూర్తి చేసినం’’అని భట్టి తెలిపారు.
ఖర్చు కేంద్రమే భరిస్తది: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
వరంగల్ ఎయిర్పోర్టు అభివృద్ధికి అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ‘‘సామాన్య ప్రజలకు విమాన ప్రయాణాన్ని సులభతరం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. మామునూరు ఎయిర్‌పోర్టును త్వరితగతిన కార్యాచరణలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రతిపాదిత ప్రాజెక్టులో 2,500 మీటర్ల రన్‌వే, టెర్మినల్ భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టవర్, అగ్నిమాపక, భద్రతా సదుపాయాలు, అనుబంధ మౌలిక వసతుల నిర్మాణాలు చేపడుతాం. పనులు మొదలైన నాటి నుంచి రెండున్నరేండ్లలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నం’’అని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
వరంగల్‌ను రెండో రాజధానిగా తీర్చిదిద్దాలి: మంత్రి కొండా సురేఖ
వరంగల్ ను రెండో రాజధానిగా తీర్చిదిద్దాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. ‘‘మామునూరు ఎయిర్పోర్టు కోసం భూసేకరణతో పాటు అవసరమైన అన్ని అనుమతుల ప్రక్రియ పూర్తి చేసినం. క్లియరెన్స్ సర్టిఫికెట్లను కేంద్ర పౌర విమానయాన శాఖకు అందజేయడం ఆనందంగా ఉంది. దశాబ్దాల పాటు నిర్లక్ష్యానికి గురైంది’’అని సురేఖ పేర్కొన్నారు.
ఒక్కటే విమానాశ్రయం ఉండటం దురదృష్టకరం: మంత్రి పొంగులేటి
తెలంగాణలో ఒక్కటే ఎయిర్పోర్టు ఉండటం దురదృష్టకరమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘వరంగల్ విమానాశ్రయాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకొని ముందుకు తీసుకెళ్లినందుకు కేంద్ర పౌర విమానయాన శాఖకు కృతజ్ఞతలు’’అని పొంగులేటి అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, రాష్ట్ర ప్రభుత్వ విమానయాన విభాగం డైరెక్టర్ భరత్ రెడ్డి, రోడ్డు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, తదితరులు హాజరయ్యారు.
తెలంగాణకు అవార్డు
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వింగ్స్ ఇండియా ఎక్స్లెన్స్అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో బెస్ట్స్టేట్ఫర్ ప్రమోషన్ఆఫ్ఏవియేషన్ఎకో సిస్టమ్అవార్డును తెలంగాణ అందుకున్నది. ఉత్తమ విమానాశ్రయాలుగా ఢిల్లీ, బెంగళూరు, పుణె, లక్నో, వీర్‌సావర్కర్ (అండమాన్) నిలి చాయి. కార్గో సర్వీసెస్‌లో ఉత్తమ అవార్డును ఎయిర్ ఇండియా సొంతం చేసుకుంది.
