పాలమూరుకు పర్యావరణ అనుమతులివ్వండి

పాలమూరుకు పర్యావరణ అనుమతులివ్వండి
  • కేంద్రానికి రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్​స్కీం రెండో దశకు పర్యావరణ అనుమతులివ్వాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మంగళవారం కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖకు చెందిన నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) సమావేశం ఆ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.గోపకుమార్ ఆధ్వర్యంలో జరిగింది. సమావేశంలో రాష్ట్ర ఇరిగేషన్​ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్, ఈఎన్​సీ మురళీధర్ తదితర అధికారులు హాజరయ్యారు.

కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు తాగునీరందించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టామని, ఇప్పటికే తొలిదశకు పర్యావరణ అనుమతులు లభించాయని రజత్ కుమార్ ఈఏసీకి తెలియజేశారు. రెండో దశకు పర్యావరణ అనుమతి కోసం 2017 అక్టోబర్ 11న టీవోఆర్ జారీ అయిందని, 2021 ఆగస్టు10న ప్రజాభిప్రాయ సేకరణనూ చేశామని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో పనులు చేస్తున్నామని, కనుక పర్యావరణ అనుమతులను ఇవ్వాల్సిందిగా నిపుణల కమిటీని కోరారు.