- గ్రామాల్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా హాజరు
 - వనపర్తి జిల్లాలో 15 మండలాలు, 268 పంచాయతీలు
 
వనపర్తి, వెలుగు: స్థానిక సంస్థలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లాలో ఏ స్థానం బీసీకి రిజర్వ్అవుతుందోనని ఆశావహులు లెక్కలు వేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో పోటీకి అవకాశం రానివారు ఈసారి తప్పకుండా టికెట్తెచ్చుకోవాలని పైరవీలు చేస్తున్నారు.
ఇందుకోసం తమ తమ పార్టీల్లోని ప్రజాప్రతినిధులు, నేతల చుట్టూ తిరుగుతున్నారు. గ్రామాల్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా హాజరవుతూ.. గ్రిఫ్ట్లు ఇస్తున్నారు. సొంత ఖర్చుతో వాటర్ ట్యాంకర్ తెప్పించడం, మురుగు కాల్వలను శుభ్రం చేయించడం, రోడ్లపై గుంతల్లో మట్టి పోయించడం వంటి పనులతో ప్రజల మన్ననలు పొందే ప్రయత్నం చేస్తున్నారు.
2 సామాజిక వర్గాలకే ఎక్కువ సీట్లు!
జిల్లాలో యాదవులు, ముదిరాజ్ల తర్వాత ఎక్కువ జనాభా ఉన్నవారు ముస్లింలు. బీసీ రిజర్వేషన్లు పెరిగితే రాజకీయ పార్టీలు పై రెండు సామాజికవర్గాల వారికి ఎక్కువ స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టికెట్ఆశిస్తున్నవారు గ్రామ పంచాయతీల్లో ఆయా సామాజిక వర్గాల జనాభా సంఖ్యను తెలుసుకుంటున్నారు. ఈ స్థానం ఫలానా కేటగిరీకి రిజర్వ్అవుతుందంటూ లెక్కలు వేసుకుంటున్నారు.
స్వల్పంగా పెరిగిన స్థానాలు
జిల్లాలో ఇదివరకు 14 మండలాలు ఉండగా.. గోపాల్పేట మండలం నుంచి ఏదుల గ్రామం కొత్త మండల కేంద్రంగా ఏర్పడింది. దీంతో మండలాల సంఖ్య 15కు పెరిగింది. జిల్లాలో గతంలో 255 గ్రామ పంచాయతీలు ఉండగా.. తాజాగా 13 పెరగడంతో 268 అయ్యాయి. ఎంపీటీసీ స్థానాలు 128 నుంచి 133కు, పోలింగ్స్టేషన్లు 652 నుంచి 657కు పెరిగాయి. అన్ని గ్రామాల్లో వార్డు, సర్పంచ్, ఉపసర్పంచ్ ఎన్నికలతోపాటు 15 ఎంపీపీ. 15 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 
