కౌన్సెలింగ్​ రూల్స్‌‌‌‌ మారుస్తూ రాష్ట్ర సర్కార్​ జీవో జారీ

కౌన్సెలింగ్​ రూల్స్‌‌‌‌ మారుస్తూ రాష్ట్ర సర్కార్​ జీవో జారీ
  • బీ కేటగిరీలో స్థానికులకు 85శాతం సీట్లు
  • 1,120 సీట్లలో 952 (85%) తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్

హైదరాబాద్, వెలుగు : ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని మేనేజ్‌‌‌‌మెంట్ కోటా (బీ కేటగిరీ) సీట్లు, మన స్టూడెంట్లకే దక్కేలా రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకుంది. బీ కేటగిరిలోని ఎంబీబీఎస్, బీడీఎస్‌‌‌‌ సీట్లలో 15శాతం సీట్లను మాత్రమే ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించిన జీవోలను గురువారం విడుదల చేసింది. రాష్ట్రంలో 20 నాన్ మైనార్టీ, 4 మైనార్టీ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మొత్తం 3,750 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నాన్ మైనార్టీ కాలేజీల్లో 3,200 సీట్లు ఉండగా, ఇందులో బీ కేటగిరీ కింద 1,120 సీట్లు ఉన్నాయి. గతేడాది దాకా ఈ సీట్లకు దేశంలోని ఏ స్టేట్​ స్టూడెంట్స్​ అయినా పోటీ పడేందుకు చాన్స్​ ఇచ్చారు. నీట్ ఆలిండియా ర్యాంక్ ఎవరికి బాగుంటే.. వారికే సీట్లు కేటాయించారు. ఈ పద్ధతికి సర్కార్ ఫుల్​స్టాప్​ పెట్టింది. 

952 సీట్లు మనోళ్లకే రిజర్వ్​

ఈ ఏడాది నుంచి 1,120 సీట్లలో 952 సీట్లను (85 శాతం) తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయాలని నిర్ణయించింది. ఇంకో 168 సీట్లను (15 శాతం) మాత్రం పాత పద్ధతిలోనే భర్తీ చేస్తామని పేర్కొంది. ఈ సీట్లకు కూడా తెలంగాణ స్టూడెంట్లు పోటీ పడేందుకు చాన్స్​ ఉంటుంది. ఇక మైనార్టీ కాలేజీల్లో 137 సీట్లు బీ కేటగిరీ కింద ఉన్నాయి. ఇందులో 116 సీట్లను తెలంగాణ స్టూడెంట్స్‌‌‌‌కు రిజర్వ్ చేశారు. మిగిలిన 21 సీట్లకు తెలంగాణ సహా, దేశంలో ఏ రాష్ట్ర విద్యార్థులైన పోటీ పడొచ్చని పేర్కొన్నారు. బీడీఎస్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కోటా సీట్లలో సైతం 85శాతం స్థానిక విద్యార్థులకే కేటాయిస్తామని జీవోలో పేర్కొన్నారు. కన్వీనర్ కోటాలో ఉన్నట్టుగా, మేనేజ్‌‌‌‌మెంట్ కోటాలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని బలహీనవర్గాల ప్రజలు కోరుతున్నప్పటికీ, ప్రభుత్వం ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదు.

కొన్ని రాష్ట్రాల్లో కనిపించని ఓపెన్​ కోటా

మేనేజ్‌‌‌‌మెంట్ కోటా సీట్లను పూర్తిగా ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తుండడంతో ఇన్నాళ్లు మన రాష్ట్ర స్టూడెంట్లు నష్టపోయారు. మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఒడిషా, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఓపెన్ కోటా విధానమే లేదు. తమ స్టేట్ స్టూడెంట్లకే సీట్లు దక్కేలా అక్కడి ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. తల్లిదండ్రులు విజ్ఞప్తి చేసినా మన సర్కార్ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని ‘‘మన మెడికల్ సీట్లు.. మనోళ్లకు దక్కుతలె” శీర్షికన ఈనెల 15న ‘వెలుగు’ ప్రముఖంగా ప్రచురించింది. దీనిపై స్పందించిన హెల్త్ మినిస్టర్ హరీశ్‌‌‌‌రావు.. లోకల్ స్టూడెంట్లకు న్యాయం చేస్తామని ప్రకటించారు. 15రోజుల్లోనే రూల్స్‌‌‌‌లో మార్పులు చేశారు.

ఇకపై సీట్ల కేటాయింపు ఇలా..

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 85శాతం సీట్లను కన్వీనర్ కోటాలోనే భర్తీ చేస్తారు. వీటన్నింటినీ లోకల్ స్టూడెంట్స్‌‌‌‌కే కేటాయిస్తారు. ఇంకో 15శాతం సీట్లను ఆలిండియా కోటాలో భర్తీ చేస్తారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50శాతం సీట్లను కన్వీనర్‌‌‌‌‌‌‌‌ కోటాలో లోకల్ స్టూడెంట్స్‌‌‌‌కు కేటాయిస్తారు. ఇంకో 15శాతం సీట్లను ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐ కోటా( సీ కేటగిరీ) కింద భర్తీ చేస్తారు. ఈ కోటాలో దేశ, విదేశాలకు చెందిన స్టూడెంట్లందరూ పోటీ పడొచ్చు. ఇక మిగిలిన 35శాతం సీట్లను మేనేజ్‌‌‌‌మెంట్ కోటా (బీ కేటగిరీ)లో భర్తీ చేస్తారు. ఈ 35శాతం సీట్లను వంద శాతానికి లెక్కగట్టి, అందులో 85శాతం సీట్లను లోకల్ స్టూడెంట్స్‌‌‌‌కు రిజర్వ్ చేస్తారు. ఇంకో 15 శాతం సీట్లను ఓపెన్‌‌‌‌ కోటాలో భర్తీ చేస్తారు.