ఉద్యోగుల లెక్క తేలినా..ఇంకా నాన్చుడే

ఉద్యోగుల లెక్క తేలినా..ఇంకా నాన్చుడే

హైదరాబాద్, వెలుగు: క్యాడర్ స్ట్రెంత్ ఫైనల్ స్టేజ్‌‌కి చేరుకున్నా.. ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర సర్కార్ నాన్చుడు ధోరణినే అవలంబిస్తోంది. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల విభజనకు ఇచ్చే ఆప్షన్ ప్రక్రియను మరింత ఆలస్యం చేయాలని సాధారణ పరిపాలన శాఖకు ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. రెండు నెలల తర్వాత జాబ్స్‌‌ రిక్రూట్‌‌మెంట్ ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
15 రోజుల కిందటే విభజన పూర్తి
కొత్త జిల్లాలు, కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం పోస్టుల విభజన 15 రోజుల కిందటే పూర్తయింది. ప్రభుత్వానికి ఆర్థిక శాఖ ప్రాథమిక నివేదిక కూడా అందజేసింది. ప్రభుత్వ శాఖల్లోని క్యాడర్ ప్రాతిపదికన జిల్లా పోస్టు, జోనల్, మల్టీ జోనల్ వారీగా క్యాడర్ స్ర్టెంత్‌‌ను పూర్తి చేసినట్లు ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగులకు ఎక్కడ కావాలనేది ఆప్షన్ ఇస్తరని, ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం నెల రోజుల టైం పడుతుందని అధికారులు 
చెప్తున్నరు. ఇప్పుటికిప్పుడు డేట్ ప్రకటించినా ఆ ప్రాసెస్ వచ్చే నెలలో పూర్తవుతుంది. అంటే ఈ లెక్కన రెండు నెలల తర్వాత కూడా రిక్రూట్‌‌మెంట్ మొదలవుతుందా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
10 నెలల నుంచి..
రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని గతేడాది డిసెంబర్ నుంచి రాష్ట్ర సర్కార్ చెబుతోంది. ఇప్పుడు సీఎం చెప్పినట్లు రెండు నెలలు గడిస్తే.. ఆ మాట చెప్పి సరిగ్గా ఏడాది అవుతుంది. బై ఎలక్షన్స్ టైంలో కావాలనే ఉద్యోగల భర్తీని తెరపైకి తెస్తున్నారని, ఆ తర్వాత మరుగున పడేస్తున్నరని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చాకే ప్రక్రియ మొదలవుతుందని సర్కార్‌‌‌‌కు ముందే తెలిసినా.. కావాలనే ఎలక్షన్స్​లో లబ్ధి పొందడానికే రిక్రూట్‌‌మెంట్​పై గందరగోళం సృష్టిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. జులై 13, 14 తేదీల్లో వేకెంట్ పోస్టులను ఐదు రోజుల్లో గుర్తించాలని కేబినెట్ మీటింగ్‌‌ సందర్భంగా ఆఫీసర్లను సీఎం ఆదేశించారు. మళ్లీ 17 రోజుల తర్వాత కేబినెట్ సమావేశమైనా జాబ్స్‌‌ భర్తీపై నిర్ణయం తీసుకోలేదు. వేకెంట్​ పోస్టులపై ఆర్థిక శాఖ ఇచ్చిన రిపోర్టునూ పట్టించుకోలేదు.