రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయం పేరుతో చేతులెత్తేసింది

రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయం పేరుతో చేతులెత్తేసింది

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత విధానాల ద్వారా రైతులు, వినియోగదారులు తీవ్రంగా నష్ట పోతున్నారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవనర్ రెడ్డి.  కేంద్రం ఫ్రీ ట్రేడింగ్ పేరుతో తన బాధ్యత నుంచి తప్పుకుంటే… రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయం పేరుతో చేతులెత్తేసిందని ఆరోపించారు . ప్రజా,రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జగిత్యాల జిల్లా లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవన్ రెడ్డి…కేంద్ర ప్రభుత్వం వ్యాపారస్తులకు కొమ్ముకాస్తే, రాష్ట్రం మిల్లర్లతో కుమ్మక్కు అయ్యిందన్నారు. దీనికి బాధ్యులు ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. రైతాంగాన్ని చైతన్య పరిచే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పై ఉందన్నారు. నిర్భంధ సాగుతో జరిగే నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చెయాలని డిమాండ్ చేశారు. సన్నరకాలకు రూ.2,500, దొడ్డు రకాలకు  రూ.1885 మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలన్నారు.

రైతు సంక్షేమానికి విఘాతం కలిగించే వ్యవసాయ బిల్లుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లుకు వ్యతిరేకంగా ఎందుకు తీర్మానం చేయలేదన్నారు జీవన్ రెడ్డి. రాష్ట్రంలో ప్రాంతీయ తత్వంతో కేసీఆర్, దేశంలో మతోన్మాదం రెచ్చగొట్టి మోడీ రాజ్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణ జలాలు తరలిస్తూ ఉంటే ఆపే ధైర్యం లేని కేసీఆర్ దేవుడితో కొట్లాడుతా అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు.దేవునితో తర్వాత ముందు నీకు చేతనైతే పొరుగు రాష్ట్ర సీఎం జగన్ తో కొట్లాడి.. కృష్ణా జలాల నీటి చౌర్యం ఆపాలన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను హరిస్తున్నావంటూ కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సూచించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి .

అంతేకాదు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ అత్యవసరంగా అసెంబ్లీని సమావేశ పరిచి సభలో బిల్లులను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది అని ఏకగ్రీవ తీర్మానం చేసి, ఆ తీర్మానాన్ని ఆమోద పర్చి కేంద్రానికి ఒక హెచ్చరిక  పంపాలని డిమాండ్ చేస్తున్నానన్నారు జీవన్ రెడ్డి.