ధరణి సమస్యలపై సర్కారు దిద్దుబాట్లు

ధరణి సమస్యలపై సర్కారు దిద్దుబాట్లు
  • ధరణి సమస్యలపై సర్కారు దిద్దుబాట్లు
  • కొన్ని భూములు అనవసరంగా పార్ట్ ​బీలో ఉన్నట్లు గుర్తింపు

హైదరాబాద్, వెలుగు: ఎట్టకేలకు ధరణి పోర్టల్​లో అనేక సర్వే నంబర్లు అనవసరంగా నిషేధిత జాబితా(ప్రొహిబిటెడ్ ​లిస్టు)లో ఉన్నట్లు గుర్తించిన రాష్ట్ర సర్కారు.. దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. వారం రోజుల్లో ప్రొహిబిటెడ్​ సర్వే నంబర్లపై పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి..  జాబితాలో అనవసరంగా నమోదైన భూములను పార్ట్ ​బీ నుంచి తొలగించాలని యోచిస్తోంది. ఈ మేరకు జూన్​30న సీఎస్​ సోమేశ్​ కుమార్​అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్​జారీ చేశారు. వారం రోజుల్లోగా ప్రొహిబిటెడ్​ లిస్టులో తప్పుగా ఎంట్రీ అయినా సర్వే నంబర్లను మార్చేందుకు తగిన వెరిఫికేషన్​ చేయాలని ఆదేశించారు. కేటగిరీల వారీగా ఏ సర్వే నంబర్​ను ప్రొహిబిటెడ్​ లిస్టులో నుంచి తీసేస్తున్నారో వాటిని కలెక్టర్ల లాగిన్​లో డిస్​ప్లే చేస్తే.. కలెక్టర్లు వాటిని ధ్రువీకరించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఏ సర్వే నంబర్​ను పార్ట్​ బీలో కొనసాగించాలనుకుంటున్నారో వాటికి బ్లాక్​ఆప్షన్, తీసేయాల్సిన వాటికి ఆన్​బ్లాక్​ ఆప్షన్​ఇవ్వనున్నారు. ప్రొహిబిటెడ్​ నుంచి సర్వే నంబర్లు తొలగించేటప్పుడు కచ్చితమైన వెరిఫికేషన్ చేసుకోవాలని సీఎస్​ కలెక్టర్లకు సూచించారు. 

ఒక్క ఊరి నుంచే వందల అప్లికేషన్లు

సిద్దిపేట జిల్లా ములుగులో ఆఫీసర్లు నిర్వహించిన ధరణి సమస్యల పైలెట్ ప్రోగ్రామ్ లో రైతులు పడుతున్న అనేక ఇబ్బందులు బయటకొచ్చాయి. ఒక్క గ్రామంలోనే 272 మంది రైతులు ధరణి తప్పులతో ఇబ్బంది పడుతున్నామని అధికారులతో వేడుకున్నారు. ధరణి పోర్టల్​తో రెవెన్యూ సమస్యలన్నీ తొలగిపోయాయని చెబుతుంటే.. ఒక్క గ్రామం నుంచే సమస్యలు పరిష్కారించాలని ఇన్ని అప్లికేషన్లు రావడంపై రాష్ట్ర సర్కారు ఒక్కసారిగా ఖంగుతిన్నది. లక్షల ఎకరాల్లో భూములు అనవసరంగా ప్రొహిబిటెట్​జాబితాలో నమోదు చేసినట్లు దాదాపు 20 నెలల తరువాత గుర్తించింది. ప్రొహిబిటెడ్ ​లిస్ట్ లో ఉన్న భూములను పరిశీలించామని, కొన్ని సర్వే నంబర్లు అందులో ఉండాల్సినవి కాదని స్వయంగా సీఎస్​ సోమేశ్ ​కుమార్ అధికారులతో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అలాంటి భూములపై పూర్తిస్థాయి విచారణ చేసి పార్ట్​ బీలో నుంచి తొలగించాలని సీఎస్​ కలెక్టర్లను ఆదేశించారు. 

 

స్పష్టత ఇవ్వండి.. మాకు తలనొప్పి వద్దు


ధరణి పోర్టల్ లో మాడ్యూల్స్, ప్రొహిబిటెడ్​ సర్వే నంబర్ల తొలగింపు విషయాలపై స్పష్టత ఇవ్వాలని, ఆ తరువాత మళ్లీ తమ మెడకు చుట్టుకోకుండా చూడాలని ఆయ జిల్లాల కలెక్టర్లు సీఎస్​ సోమేశ్ కుమార్​తో మొర పెట్టుకున్నట్లు తెలిసింది. ధరణిపై టెలీ కాన్ఫరెన్స్​లో భాగంగా రైతుల నుంచి రోజూ అప్లికేషన్లు వస్తున్నాయని, వాటిలో భూములకు సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయని వారు సీఎస్​కు వివరించినట్లు సమాచారం. ధరణిలో సవరణలకు కొన్ని రకాల మాడ్యుల్స్​తెచ్చినా.. అవి కరెక్ట్ గా లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు వివరించారు. ఇప్పటికే నాలుగైదు సార్లు అప్లికేషన్లు పెట్టుకున్నా.. పరిష్కారం కాకపోవడాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారని కలెక్టర్లు సీఎస్ దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా ప్రొహిబిటెడ్​ లిస్ట్​లో ఉన్న భూములపై గందరగోళం ఉందని దానిపై పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వాలని కోరినట్లు తెలిసింది.