ఘట్కేసర్, వెలుగు: డ్రగ్స్, గంజాయి రహిత తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఘట్ కేసర్ లో ప్రభుత్వం మంజూరు చేసిన కాప్రా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.
ఎక్సైజ్ శాఖను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో 14 కొత్త ఎక్సైజ్ స్టేషన్లను మంజూరు చేసిందన్నారు. గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఈఎస్ నవీన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేశ్, ఘట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మురళి, పావని, జంగయ్య యాదవ్, చక్రపాణి, ఎక్సైజ్ సీఐ రవి, మేడిపల్లి సీఐ గోవిందరెడ్డి నాయకులు పాల్గొన్నారు.
డ్రగ్స్‌కు బానిస కావద్దు
జూబ్లీహిల్స్: యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. సోమవారం అమీర్ పేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో కొత్తగా ఏర్పాటు చేసిన బంజారాహిల్స్ ఎక్సైజ్ పోలీస్ శాఖ కార్యాలయాన్ని హైదరాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి తో కలిసి ఆమె ప్రారంభించారు. డ్రగ్స్, గంజాయి రహిత నగరం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ పంచాక్షరి, ఏఈ ఎస్.శ్రీనివాసరావు, సీఐ బానోత్ పటేల్ పాల్గొన్నారు.
గండిపేట, కొండాపూర్ స్టేషన్లు ప్రారంభం..
గండిపేట/చందానగర్: బండ్లగూడ జాగీరులో గండిపేట ఎక్సైజ్ స్టేషన్‌ను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ, డిప్యూటీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ దేవేందర్ రావు పాల్గొన్నారు. చందానగర్‌లోని శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన కొండాపూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ను ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా శేరిలింగంపల్లి ఇన్స్పెక్టర్ లక్ష్మణ్‌గౌడ్ బాధ్యతలు చేపట్టారు.
