
కేంద్రం నిధులు విడుదల చేసినా వాటా ఇవ్వని రాష్ట్ర సర్కారు
హైదరాబాద్, వెలుగు: సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) కింద కేంద్రం నిధులు విడుదల చేసినా, రాష్ట్రం తన వాటా మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వక సమస్యలు ఎదురవుతున్నాయి. స్కూళ్లలో నిర్మాణాలు, అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. కేంద్రం అమలు చేస్తున్న కార్యక్రమాలు కూడా ఆగిపోతున్నాయి.
మొదటి విడతకు నామమాత్రంగా..
ఈ విద్యా సంవత్సరం రాష్ట్రంలోని స్కూళ్లలో పలు అభివృద్ధి పనుల కోసం ‘కేంద్ర ప్లానింగ్ అప్రూవల్ బోర్డు(పీఏబీ)’ రూ.1,800 కోట్లకు అంగీకరించింది. కేంద్రం 60 శాతం నిధులిస్తే.. రాష్ట్రం 40 శాతం వాటా మ్యాచింగ్ గ్రాంట్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర నిధులు విడుదల చేశాక, రాష్ట్రవాటాను కలిపి అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలి. కేంద్రం ఈ మొత్తాన్ని సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ), టీచర్ ఎడ్యుకేషన్ కింద ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇందులో మే, జూన్ నెలల్లో కేంద్ర వాటా కింద రూ.382 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర సర్కారు దానికి 40 శాతం మ్యాచింగ్ గ్రాంట్ కింద రూ. 254.6 కోట్లు మంజూరు చేయాల్సి ఉన్నా.. నామమాత్రంగా నిధులిచ్చింది. దీనివల్ల పలు జిల్లాల్లో స్కూల్ బిల్డింగుల నిర్మాణాలు ఆగిపోయాయని అధికారులు చెప్తున్నారు.
రెండో విడత ఊసే లేదు..
రెండు నెలల కింద కేంద్రం రెండో విడతగా రూ.452.62 కోట్లు రిలీజ్ చేసింది. మిగతా రాష్ట్రాల కంటే ముందే తెలంగాణకు నిధులిచ్చింది. ఎస్ఎస్ఏ స్కీమ్ కింద రూ.301.13 కోట్లు, ఆర్ఎంఎస్ఏకింద రూ.148.71 కోట్లు, టీచర్ఎడ్యుకేషన్ కోసం రూ.2.78 కోట్లు అందాయి. రాష్ట్ర వాటా కింద ఆ నిధులకు మరో రూ.301.75 కోట్లు కలిపి ఖర్చు చేయాలి. కానీ ఇప్పటికీ ఆ ఊసెత్తడం లేదు. మొదటి విడత నిధుల్లోనే చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి. త్వరలో మూడో విడత నిధులూ రానున్నాయి. అయినా సర్కారులో స్పందన లేదు. తాము ఇచ్చిన నిధులను సక్రమంగా వినియోగిస్తే..అదనంగా మరిన్ని నిధులిస్తామని కూడా కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నిధులనే సరిగా వినియోగించడం లేదు.
పనులెన్నో పెండింగ్..
రాష్ట్రం మ్యాచింగ్గ్రాంట్స్ ఇవ్వకపోవడంతో విద్యా శాఖ పరిధిలో చాలా అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. మంజూరైన కొత్త భవనాలు, టాయ్లెట్లు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాట్ల పనులు ఆగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం కేవలం మిడ్‌డే మీల్స్ కు మాత్రమే నిధులు మంజూరు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్కూల్మేనేజ్మెంట్ కమిటీలు చేపట్టిన చిన్నచిన్న పనులు కూడా పెండింగ్‌లో పడ్డాయి. పెద్ద కాంట్రాక్టర్లకు ఏండ్ల నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వాళ్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక మిడ్ డే మీల్స్‌లో రాగి లడ్డూ ఇస్తామని పీఏబీలో నిర్ణయం తీసుకున్నా ఇప్పటికీ స్టూడెంట్లకు అందడం లేదు. ల్యాబ్స్, లైబ్రరీల పనులూ ఆగిపోయాయి. ఇప్పటికైనా రాష్ట్ర సర్కారు నిధులివ్వాలని టీచర్ల సంఘాలు, స్టూడెంట్లు డిమాండ్ చేస్తున్నారు.