పేరెంట్స్​కు రాష్ట్ర సర్కారు మరో షాక్..!

పేరెంట్స్​కు రాష్ట్ర సర్కారు మరో షాక్..!

హైదరాబాద్, వెలుగు : ప్రైవేటు స్కూళ్లలో చదివే పిల్లల పేరెంట్స్​కు రాష్ట్ర సర్కారు మరో షాక్ ఇవ్వనుంది. వచ్చే ఏడాది పాఠ్య పుస్తకాల రేట్లను పెంచనుంది. ఈ విద్యా సంవత్సరమే ధరలు పెరగ్గా, వచ్చే ఏడాది కూడా అదే స్థాయిలో రేట్లు పెరగనున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. అయితే కాగితం ధర, పేజీ మందం పెంచడం వల్లే ధరలు పెరగనున్నాయని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలోని సర్కారు, ఎయిడెడ్ స్కూళ్లలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ చదివే సుమారు 20 లక్షల మందికిపైగా  స్టూడెంట్లకు ప్రభుత్వం ఏటా ఉచితంగా పుస్తకాలు అందిస్తోంది. కానీ ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులు సొంతంగా మార్కెట్​లో బుక్స్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంది. 

రాష్ట్రవ్యాప్తంగా 11 వేల వరకూ ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు ఉండగా, వాటిలో 30 లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. అయితే, ప్రైమరీ స్కూల్​లో చదివే స్టూడెంట్లు.. ప్రైవేటు పబ్లిషర్స్ పుస్తకాలు కూడా వాడుకునే అవకాశం ఉంది. దీంతో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు సొంతంగా పుస్తకాలు ప్రింట్ చేయించుకొని విద్యార్థులకు అమ్ముతున్నాయి. ఈ లెక్కన సుమారు20 లక్షల మంది వరకూ సర్కారు సూచించిన పుస్తకాలే వాడుతున్నారని అంచనా. వీరందరి కోసం కోటికి పైగా పుస్తకాలను ప్రింట్ చేయించనున్నారు. అయితే ప్రైవేటు స్టూడెంట్లపై వచ్చే ఏడాది కూడా పుస్తకాల భారం పడనున్నది. గతేడాది ఒక్కో పుస్తకం ధర 50 నుంచి 70 శాతం పెరగ్గా, ఈ ఏడాది కూడా 40 నుంచి 50శాతం పెరిగే అవకాశం ఉంది. కాగా, ప్రభుత్వ బడుల్లో చదివే స్టూడెంట్లకు అందించే పుస్తకాల వల్ల  ప్రభుత్వంపై వచ్చే ఏడాది రూ.190 కోట్ల భారం పడనుందని విద్యా శాఖ అధికారులు  అంచనా వేశారు. 

పేజీ మందంతో...

వచ్చే ఏడాది పుస్తకాల్లోని పేజీలను మరింత మందంగా చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. దీంట్లో భాగంగా పుస్తకాల కవర్  పేజీకి ఇప్పటి వరకూ 200  జీఎస్ఎం కాగితం వాడుతుండగా, దాన్ని 250 జీఎస్ఎంకు పెంచారు. ప్రస్తుతం లోపలి పేజీల్లో 70  జీఎస్ఎం కాగితం వాడుతున్నారు. వచ్చే ఏడాదికి 90 జీఎస్ఎం కాగితం వాడాలని నిర్ణయించారు. కాగితం ధర కూడా మార్కెట్​లో పెరిగిందని అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది కాగితం టన్ను ధర రూ.95 వేలు ఉంటే..  ప్రస్తుతం అది రూ.1.21 లక్షలకు పెరిగిందని పేర్కొంటున్నారు. ఈ కారణాలతో పుస్తకాల రేట్లు పిరం అవుతాయంటున్నారు. ప్రస్తుతం టెన్త్ క్లాస్​లో 8 పుస్తకాలకు రూ.1074 ధర ఉంటే.. వచ్చే ఏడాది అది రూ.1600 వరకూ పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇలా అన్ని క్లాసులకూ పుస్తకాల ధరలు పెరగనున్నాయి. మరోవైపు ప్రైవేటు ఫీజులు భారీగా పెరగడంతో పాటు పుస్తకాల రేట్లు పెరగడంపై పేరెంట్స్  తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఫీజులనైనా కంట్రోల్ చేయాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.