ఇయ్యాల అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న హరీశ్ రావు

ఇయ్యాల అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న హరీశ్ రావు
  • 5 స్కీమ్​లకే 68 వేల కోట్లు
  • బడ్జెట్ లో దళిత బంధు, రైతు బంధు, పింఛన్లు,
  • సొంత జాగాలో ఇండ్లు, పవర్ సబ్సిడీకి ఎక్కువ నిధులు 
  • అప్పుల కిస్తీలు, వడ్డీల చెల్లింపులకు 28 వేల కోట్లు
  • బడ్జెట్ ప్రపోజల్స్ కు ఆమోదం తెలిపిన కేబినెట్ 

హైదరాబాద్, వెలుగు:2023–24 బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టనుంది. ఉదయం 10:30 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు అసెంబ్లీలో బడ్జెట్​ ప్రవేశపెట్టనుండగా, కౌన్సిల్ లో శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్​రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఆదివారం ఉదయం ప్రగతి భవన్​లో సీఎం కేసీఆర్​అధ్యక్షతన జరిగిన కేబినేట్ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఎలక్షన్​ ఇయర్​ కావడంతో సర్కార్​ భారీ బడ్జెట్​ను ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. కొత్త స్కీమ్స్ ఏముంటాయి? ప్రస్తుతమున్న స్కీమ్ లకు ఏ మేరకు కేటాయింపులు ఉంటాయి? అనే దానిపై ఆసక్తి నెలకొంది. మొత్తం బడ్జెట్ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.2.90 లక్షల కోట్ల మేర ఉంటుందని అంచనా. గతేడాది కంటే దాదాపు రూ.30 వేల కోట్ల నుంచి రూ.34 వేల కోట్లు అధికం.


ఈసారి దళితబంధు, రైతుబంధుకే ఎక్కువ కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. పోయినేడాది పెట్టిన బడ్జెట్​లో దళిత బంధుకు రూ.17,700 కోట్లు కేటాయించగా.. ఈసారి కూడా అదే  స్థాయిలో కేటాయించినట్లు తెలిసింది. ఇక రైతుబంధుకు ఈ ఏడాది కూడా దాదాపు రూ.15 వేల కోట్లు ప్రతిపాదించినట్లు సమాచారం. పవర్ సబ్సీడీకి రూ.11 వేల కోట్లు, ఆసరా పింఛన్లకు రూ.12 వేల కోట్లు, సొంత జాగాలో ఇండ్లు నిర్మించుకునేటోళ్లకు ఆర్థిక సాయం అందించే పథకం కోసం రూ.12 వేల కోట్లు కేటాయించినట్లు తెలిసింది. అంటే బడ్జెట్ లో ఈ ఐదు స్కీమ్ ల వాటానే దాదాపు రూ.68 వేల కోట్లు కానుంది. ఇక ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్​కు రూ.3 వేల కోట్లు, స్కాలర్​షిప్, డైట్ కు రూ.5 వేల కోట్లు, పల్లె, పట్టణ ప్రగతికి రూ.5,500 కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదించినట్లు తెలిసింది. 

ఇరిగేషన్​కు రూ.25 వేల కోట్లు! 

ఇరిగేషన్​కు పెద్ద ఎత్తున నిధులు అవసరమని ఆ డిపార్ట్​మెంట్​నుంచి ప్రభుత్వానికి ప్రపోజల్స్​వచ్చాయి. ఈసారి బడ్జెట్ లో ఇరిగేషన్​కు రూ.25 వేల కోట్ల మేర కేటాయింపులు చేసినట్లు తెలిసింది. హెల్త్, ఎడ్యుకేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్​డిపార్ట్​మెంట్లకు కూడా ఈసారి భారీగా నిధులు కేటాయించినట్లు సమాచారం. హౌసింగ్​ను ఆర్అండ్​ బీలో విలీనం చేయడంతో ఈసారి పద్దు పెరగనుంది. ఉద్యోగుల హెల్త్​ స్కీమ్​కు ప్రభుత్వం నుంచి కార్పస్​ఫండ్​ కేటాయించే అవకాశం ఉంది. ఇందుకు రూ.2 వేల కోట్ల మేర కేటాయింపులు ఉండే చాన్స్ ఉంది. కొత్త ఉద్యోగాల భర్తీ​ఉన్నందున ఈసారి జీతాలు, పింఛన్లు ఇతరత్రా కింద ఫైనాన్స్​డిపార్ట్​మెంట్ కు రూ.46 వేల కోట్లు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇక ఎప్పటి మాదిరి గతంలో చేసిన అప్పుల వడ్డీలకు రూ.20 వేల కోట్లు, కిస్తీల చెల్లింపులకు ఇంకో రూ.8 వేల కోట్ల మేర కేటాయించినట్లు సమాచారం. ఈసారి కూడా భూముల అమ్మకం, ల్యాండ్​ డెవలప్​మెంట్ కింద భారీగా ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల కోసం 4 వేల కోట్ల అప్పు..  

కేబినెట్ సమావేశంలో బడ్జెట్ రూపకల్పన, ప్రభుత్వ ప్రాధాన్యాలు, నిధుల కేటాయింపు తదితరాలపై మంత్రులకు సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు. నాలుగు కొత్త ఆసుపత్రుల నిర్మాణం కోసం రుణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వరంగల్​లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రూ.1,200 కోట్లు.. హైదరాబాద్​లోని మూడు ఆసుపత్రుల కోసం రూ.2,800 కోట్లు అప్పు ద్వారా సమీకరించుకోవాలని నిర్ణయించింది. ఇక భద్రాచలం, సారపాక, రాజంపేట గ్రామపంచాయతీల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్​ఇచ్చింది. మున్సిపాలిటీలుగా మార్చాలన్న ప్రతిపాదనలకు ట్రైబల్​అడ్వైజరీ కౌన్సిల్ అనుమతించకపోవడంతో తిరిగి మళ్లీ పంచాయతీలుగానే కొనసాగించాలని నిర్ణయించింది. మూడు  గ్రామపంచాయతీలుగా భద్రాచలం, రెండు పంచాయతీలుగా సారపాకను విభజించారు. కాగా, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై స్పీచ్ బాగుందంటూ మంత్రి కేటీఆర్ ను పలువురు మంత్రులు, అధికారులు అభినందించారు.