
- ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి
- వేసవి కార్యాచరణపై వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్,వెలుగు: గ్రేటర్ సిటీతో పాటు ఓఆర్ఆర్ పరిధిలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వాటర్‌బోర్డు సన్నాహాలు చేస్తోంది. శుక్రవారం అధికారులతో వాటర్‌బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి సమీక్షా నిర్వహించారు. సమావేశంలో తాగునీటి సరఫరా, ఇతర అంశాలపై అధికారులకు ఆయన సూచనలు చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే 5 నెలలకు తాగునీరు సరఫరా చేసేందుకు క్షేత్రస్థాయిలో మైక్రో లెవల్ ప్లాన్స్ రూపొందించుకోవాలన్నారు.
అవసరాన్ని బట్టి అదనపు జలాలను తరలించడానికి ఎమర్జెన్సీ పంపింగ్ కోసం ఏర్పాట్లు మొదలు పెట్టినట్లు వెల్లడించారు. ఆయా ప్రాంతాలకు కేటాయించే నీటి సరఫరాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఏ ప్రాంతంలోనైనా సప్లైలో తక్కవ నీరుంటే.. సర్దుబాటు చేసే లాగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నీటి సరఫరా చేసేటప్పుడు సమయ పాలన పాటించాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తక్షణం స్పందించాలని ఆదేశించారు.
నీటి సమస్యలకు 24 గంటల్లో పరిష్కారం చూపించాలన్నారు. మోటార్లు, బూస్టర్లు, వాల్వులు రిపేర్లు వస్తే ఆటోమేటిక్ మెయింటెనెన్స్సిస్టమ్(ఏఎంస్) కింద మరమ్మతులు చేయాలని వివరించారు. అవసరానికి సరిపడా వాల్వులను, జంక్షన్లు, తదితర సామగ్రిని సెంట్రల్ స్టోర్‌లో అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సంబంధిత జీఎంను ఆదేశించారు.
నీటి కొరత, లో ప్రెజర్ ఫిర్యాదులకు ప్రాధాన్యం
తాగునీటి సరఫరా, నీటి కొరత, లో ప్రెజర్ సమస్యలపై వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎండీ సుదర్శన్‌రెడ్డి సూచించారు. వాటి పర్యవేక్షణ, పరిష్కారానికి ప్రత్యేక బృందాల్ని సీజీఎంల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలన్నారు. పవర్ కట్స్ ఉంటే.. ఇతర సమయాల్లో నీటి సరఫరా చేయాలన్నారు. చేతి పంపులు, బోర్ వెల్స్ నిర్వహణ దృష్టి సారించాలన్నారు. అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండేందుకు అదనపు సామగ్రి ఉంచుకోవాలని పేర్కొన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని డిమాండ్‌ను అంచనా వేసి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ప్రణాళికలు వేసుకోవాలన్నారు.