- మానవీయ కోణంలో సేవలు అందించాలి
- ఉస్మానియా మెడికల్ కాలేజీ 175వ స్నాతకోత్సవంలో
- గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
- వచ్చే ఏడాది చివరికల్లా ఉస్మానియాకు కొత్త భవనం: మంత్రి దామోదర రాజనర్సింహా
కోఠి, వెలుగు: వైద్య రంగంలో వస్తున్న కొత్త టెక్నాలజీని డాక్టర్లు అందిపుచ్చుకోవాలని, ఆధునిక పరికరాలతో సమర్థమైన చికిత్సలు చేయాలని రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా సూచించారు. సేవే పరమ ధర్మం అనే స్ఫూర్తితో, మానవీయ కోణంలో సేవలు అందించాలన్నారు. శనివారం హైదరాబాద్ కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ 175వ స్నాతకోత్సవానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహాతో కలిసి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వైద్య వృత్తిని కేవలం ఉపాధి మార్గంలా చూడొద్దని, మానవాళికి సేవ చేయడానికి తీసుకునే ప్రతిజ్ఞగా భావించాలన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ దశాబ్దాలుగా దేశానికి నిబద్ధతతో, నైపుణ్యంతో కూడిన డాక్టర్లను అందిస్తున్న గొప్ప వారసత్వ సంస్థగా నిలిచిందని కొనియాడారు. కఠోర శ్రమ, అంకితభావంతో పట్టభద్రులైన విద్యార్థులను గవర్నర్ అభినందించారు.
ప్రస్తుతం వైద్య రంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో సాంకేతికత, పరిశోధనల ప్రాధాన్యం పెరిగిందన్నారు. వైద్యంలో ఆధునిక పరికరాలను వినియోగిస్తూనే, మానవీయతను మరువకూడదని హితవు పలికారు. రోగికి వైద్యుడిపై నమ్మకం కలిగేలా నడుచుకోవాలన్నారు. యువ వైద్యులు గ్రామీణ సేవల నుంచి అత్యాధునిక పరిశోధనల వరకు ప్రతి రంగంలోనూ నైతిక విలువలతో సేవలు చేయాలని సూచించారు.
ఉస్మానియాకు వచ్చే ఏడాదికల్లా కొత్త భవనం..
గోషామహల్‌లో నిర్మాణంలో ఉన్న ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనం పనులు వేగంగా సాగుతున్నాయని, వచ్చే ఏడాది చివరికల్లా దానిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో, అన్ని రకాల సౌకర్యాలతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నామని చెప్పారు. డాక్టర్లు పేషెంట్లతో మానవత్వంతో వ్యవహరించాలని, ధనార్జనే లక్ష్యంగా పెట్టుకోకూడదని సూచించారు.
ప్రభుత్వం తరఫున డాక్టర్లకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దశాబ్దాలుగా ఉన్న ఉస్మానియా కొత్త ఆస్పత్రి నిర్మాణ కలను తమ ప్రభుత్వం నెరవేరుస్తోందని మంత్రి పేర్కొన్నారు. వచ్చే ఏడాది చివరికల్లా కొత్త భవనాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రి రోజూ వేలాది మందికి సేవలందిస్తోందని, ఇటీవల 18 నెలల చిన్నారికి విజయవంతంగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నిర్వహించడం వైద్యుల ప్రతిభకు నిదర్శనమన్నారు.
కొత్త ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలు, అత్యవసర చికిత్సలు మరింత విస్తృతంగా అందుబాటులోకి వస్తాయన్నారు. గాంధీ, ఉస్మానియా మెడికల్ కాలేజీల్లో విద్యార్థుల కోసం ఆధునిక వసతులతో హాస్టల్ భవనాల నిర్మాణం కూడా చేపట్టామని తెలిపారు. కొత్త ఉస్మానియా ఆస్పత్రి రాష్ట్ర వైద్య రంగంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. అనంతరం ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు గవర్నర్ తో కలిసి మంత్రి పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రమేశ్ రెడ్డి, డీఎంఈ నరేంద్ర కుమార్, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజారావు తదితరులు పాల్గొన్నారు.
