పడిపోయిన సర్కార్​ ఆదాయం

పడిపోయిన సర్కార్​ ఆదాయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. అన్ని లిక్కర్ డిపోల పరిధిలో అమ్మకాలు తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. సాధారణ రోజుల్లో అమ్ముడయ్యే వాటి కన్నా సగానికి సగం తగ్గాయి. గత 8 రోజుల్లో లిక్కర్ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిందని ఆబ్కారీ అధికారులు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, అసాధారణ వరదలతో ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. జనజీవనం అస్తవ్యస్తం కావడంతో ప్రజలు బయటకు రావడానికే ఇబ్బందులు పడ్డారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సర్కారుకు ఆదాయాన్ని తెచ్చి పెట్టే మద్యం వారం రోజులుగా అమ్ముడే పోలేదు. ఒక్క రోజు అమ్మకాలు తగ్గినా.. దాన్ని సీరియస్ గా తీసుకుని గ్రౌండ్ లెవెల్ అధికారులకు టార్గెట్లు పెట్టే అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు, వారం రోజుల పరిస్థితిని చూసి నోరు మెదపడం లేదు.

3 రోజుల్లో సగం కన్నా తక్కువకు..

రాష్ట్రవ్యాప్తంగా 8వ తేదీ నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. ఎడతెరిపి లేకుండా వారం రోజుల పాటు భారీ వర్షాలు కురవడంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో అన్ని చోట్లా సహాయక చర్యలు చేపట్టాల్సి వచ్చింది. నిజానికి చల్లని వాతావరణంలో బీర్లకు ప్రత్యామ్నాయంగా ఐఎంఎల్ ఎక్కువగా సేల్ అవుతుంటుంది. కానీ బీర్లు, ఐఎంఎల్ అమ్మకాలు కూడా సగానికి సగం పడిపోయాయి. రాష్ట్రంలో 2,620 మద్యం షాపులతో పాటు బార్లు, పబ్లు, క్లబ్లు ఉన్నాయి. వివిధ జిల్లాల్లో ఉన్న లిక్కర్ డిపోల నుంచి వీటికి సరుకు సరఫరా అవుతున్నది. అయితే రోజూవారీ లెక్కల్ని పరిగణనలోకి తీసుకుంటే నిత్యం1.6 లక్షల బీర్ కేసులు అమ్ముడవుతుంటాయి. ఎండా కాలంలోనైతే ఇది 1.8 లక్షల నుంచి 2 లక్షల కేసుల వరకు ఉంటుంది. డైలీ యావరేజ్ లెక్కేస్తే రోజుకు 1.6 లక్షల బీర్ కేసులు అమ్మాల్సి ఉండగా ఈనెల 9 నుంచి కేవలం 2 రోజుల్లో మాత్రమే లక్ష కేసుల మార్కు దాటింది. 9 నాడు 1.07 లక్షలు, 16 నాడు 1.28 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. ఈనెల 13, 14వ తేదీల్లోనైతే అసలు లక్ష్యంలో దాదాపు నాలుగో వంతు వరకు మాత్రమే సేల్​ అయ్యాయి