రాష్ట్రంలో వంద శాతం వ్యాక్సినేషన్​ 

రాష్ట్రంలో వంద శాతం వ్యాక్సినేషన్​ 

యాదగిరిగుట్ట, వెలుగు: కరోనా ఫోర్త్​ వేవ్​ వల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ప్రస్తుత వేరియంట్ కు వేగంగా వ్యాప్తి చెందే స్వభావమున్నా మరణాలకు దారితీసేంత ప్రమాదకారి కాదని చెప్పారు. శనివారం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వయంభూ నారసింహుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ..  కరోనా ఫోర్త్​ వేవ్​ వస్తే  సమర్థవంతంగా ఎదుర్కోడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నదని తెలిపారు.

రాష్ట్రంలో 100% కరోనా వ్యాక్సినేషన్ పూర్తయిందని, వైరస్ ప్రభావం రాష్ట్ర ప్రజలపై పెద్దగా ఉండబోదని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందొద్దని, కొవిడ్​ రూల్స్  పాటించాలని సూచించారు. కరోనాకు సంబంధించిన మూడు వేరియంట్లను నరసింహస్వామి దయతో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని డీహెచ్​ శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ అభిషేక్ రెడ్డి కూడా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.