గ్రామీణ బ్యాంకులను జాతీయ బ్యాంకులుగా మార్చండి: ఉద్యోగులు

గ్రామీణ బ్యాంకులను జాతీయ బ్యాంకులుగా మార్చండి: ఉద్యోగులు

ముషీరాబాద్, వెలుగు: దేశంలోని గ్రామీణ బ్యాంకులన్నీ జాతీయ గ్రామీణ బ్యాంకులుగా ఏర్పాటు చేయాలని ఆ బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫారసు మేరకు వెంటనే జాతీయ గ్రామీణ బ్యాంకులుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ, తెలంగాణ రీజినల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి ధర్నా జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రవికాంత్, వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడారు. గ్రామీణ బ్యాంకులపై నియంతృత్వ పెత్తనాన్ని సాగిస్తున్న వాణిజ్య బ్యాంకుల నుంచి వెంటనే విముక్తి చేయాలని కోరారు.

సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ అవార్డు తీర్పుల మేరకు గ్రామీణ బ్యాంకు ఉద్యోగులకు వాణిజ్య బ్యాంకు ఉద్యోగులతో సమానంగా అన్ని సదుపాయాలు, సర్వీస్ రూల్స్ ప్రమోషన్స్ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ బ్యాంకుల్లో 30 వేల పైగా ఖాళీలు ఉన్నాయని వాటిని భర్తీ చేయకుండా పని భారాన్ని పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బ్యాంకింగ్  రంగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ బిక్షమయ్య, నరసింహా రాజు, అప్పల నాయుడు, క్రాంతి కుమార్, రాజ్ కుమార్, ఉదయ శ్రీ, దివ్య, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.