- రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్
చేవెళ్ల, వెలుగు : వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని.. పనితీరు మెరుగుపరుచుకోవాలని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ సూచించారు. విధి నిర్వహణలో అజాగ్రత్తగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలోని డయాలసిస్ కేంద్రంలో శనివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటు చేసుకోగా.. ఆయన ఆదివారం పరిశీలించారు.
ప్రమాదానికి గల కారణాలను డీసీహెచ్ఎస్ రాజు, ఆస్పత్రి ఇన్ చార్జ్ సూపరింటెండెంట్ సోమశేఖర్ ను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వార్డును పునరుద్ధరించి రోగులకు డయాలసిస్ సేవలు అందించాలని ఆదేశించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రసవాల సంఖ్యను పెంచాలని పేర్కొన్నారు.
ఆస్పత్రిలోని సమస్యలను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చొరవ తీసుకుంటానని చేవెళ్ల కాంగ్రెస్ ఇన్ చార్జ్ భీం భరత్ హామీ ఇచ్చారు. ఆయన వెంట పార్టీ నేతలు వసంతం, ఆగిరెడ్డి, గుండాల రాములు, పెంటయ్య గౌడ్, శ్రీనివాస్ గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, పడాల ప్రభాకర్, మాణిక్యం ఉన్నారు.
