భయపడొద్దు.. టీకా వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవ్

భయపడొద్దు.. టీకా వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవ్

వ్యాక్సిన్ తో ఎలాంటి సైడ్ ఎఫెక్స్ట లేవని..భయపడకుండా తీసుకోవాలని సూచించారు రాష్ట్ర మంత్రులు. కరోనా సమయంలో వైద్య సిబ్బంది త్యాగాలు గొప్పవన్నారు. గాంధీ హాస్పిటల్లో వ్యాక్సినేషన్ ప్రారంభించిన  మంత్రి ఈటల.. వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందన్నారు. మొదటిదశలో భాగంగా దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇస్తున్నట్లు చెప్పారు. గాంధీలో సఫాయి కార్మికురాలు కృష్ణమ్మకు మొదటి టీకా ఇచ్చారు.

వ్యాక్సిన్ పై జనానికి అనుమానాలు అవసరం లేదన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత. ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు టీకా అందుతుందన్నారు. తొందర్లోనే సెంటర్లు పెంచి.. అందరికీ వ్యాక్సిన్ ఇస్తామన్నారు సబితా ఇంద్రారెడ్డి. నార్సింగి హాస్పిటల్ లో కరోనా వ్యాక్సినేషన్ ను ఆమె ప్రారంభించారు.

కరోనాకు వ్యాక్సిన్ రావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ MGMలో కరోనా వ్యాక్సినేషన్ ను ప్రారంభించిన ఎర్రబెల్లి.. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 21 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. 126 మందికి వైద్య పారిశుధ్య కార్మికులకు టీకాలు వేయడం జరుగుతుందన్నారు. వ్యాక్సిన్ వచ్చినా జనం జాగ్రత్తలు పాటించాలన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు అబ్జర్వేషన్ లో ఉండాలని.. 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ తీసుకోవాలన్నారు.

ప్రపంచంలో 40 శాతం జనాభాకు భారత్ నుంచి వ్యాక్సిన్ అందించడం గర్వంగా ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ జిల్లాలో వ్యాక్సినేషన్ ను మంత్రి ప్రారంభించారు. జిల్లాలో 4 సెంటర్లలో వ్యాక్సిన్ ఇస్తున్నామన్నారు. తొలివిడతలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు అందిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ నుంచి వ్యాక్సిన్ ప్రపంచానికి అందించడం గొప్పగా ఉందన్నారు.

టీకా వేసుకున్న వారిలో ఇప్పటి వరకు ఎక్కడా సైడ్ ఎఫెక్ట్ రాలేదన్నారు మంత్రి గంగుల కమలాకర్.  కరోనా మహమ్మారితో ప్రజలంతా తొమ్మిది నెలలుగా తీవ్ర అవస్థలు పడ్డారన్నారు. జిల్లాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాక్సినేషన్ ప్రక్రియ సాగుతుందన్నారు. కరీంనగర్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెండ్ డా.రత్నమాల ఇంజెక్షన్ తీసుకున్నారని… ఆమెకు 20 నిమిషాలు గడిచినా ఎలాంటి దుష్పరిణామాలు రాలేదన్నారు.  టీకా చాలా సేఫ్ అని అర్థమవుతోందని.. ప్రజలెవరూ వాక్సిన్ తీసుకునేందుకు భయపడవద్దన్నారు. గర్భిణీలకు, 18 సంవత్సరాల లోపు వారికి ప్రస్తుతం టీకా వేయడం లేదన్నారు.