సీఎం కేసీఆర్ కరోనాను కాదు…కేసుల సంఖ్యను కంట్రోల్ చేస్తున్నారు: నాగం

సీఎం కేసీఆర్ కరోనాను కాదు…కేసుల సంఖ్యను కంట్రోల్ చేస్తున్నారు: నాగం

రాష్ట్ర మంత్రులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారన్నారు కాంగ్రెస్ నేత నాగం జనార్థన్ రెడ్డి. గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్ పెట్టడం లేదని రోగులు మొరపెట్టుకుంటుంటే.. సిబ్బంది ఆక్సిజన్ అయిపోయింది అని చెబుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కరోనా ను కంట్రోల్ చేయడం లేదని… కరోనా కేసుల నమోదు ఫిగర్స్ ను కంట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు.

ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితి చూస్తే బాధేస్తోందన్నారు నాగం. డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని.. ప్రతి ఏడాది ఆస్పత్రికి సంబంధించిన మెయింటెనెన్స్ డబ్బులు ఎందుకు ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. కొన్ని లక్షల మంది ప్రఖ్యాతి గాంచిన డాక్టర్లను ఉత్పత్తి చేసిన ఆస్పత్రి ఉస్మానియా అని అన్నారు. నిన్నటి పరిస్థితి చూస్తే రోగులు ఆస్పత్రికి వస్తారా..? అని అన్నారు. సీఎం కేసీఆర్  రోజువారీగా కరోనా సమీక్షలు చేయాలని డిమాండ్ చేశారు.తాను మంత్రిగా  ఉన్న సమయంలో చిన్నచిన్న రోగాలకు సీఎం స్థాయిలో సమీక్షలు జరిగేవని గుర్తు చేశారు.

గచ్చిబౌలి లో కోవిడ్ ఆస్పత్రిని నిర్మించిన ప్రభుత్వం..డాక్టర్లను నియమించడం మరిచిందన్నారు. ఏడాది ఒప్పందానికి డాక్టర్లు వస్తారా అని అన్నారు. అందులో పర్మినెంట్ డాక్టర్లను నియమించాలన్నారు.ఉస్మానియాలో ఆస్పత్రిని  కడతాము అంటే మేము కట్టనీయకుండా అడ్డుపడుతున్నామని మంత్రులు అంటున్నారన్న నాగం జనార్ధన్ రెడ్డి.. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరంలో నాలుగు నిమ్స్ ను తలదన్నే ఆస్పత్రులను నిర్మిస్తామన్నారు..ఏమైందని ప్రశ్నించారు. గతంలో మేము అనేక ఆస్పత్రులు నిర్మించామని.. అవే ఇప్పుడు మీకు గతి అవుతున్నాయన్నారు.

అనవసరంగా మళ్ళీ లాక్ డౌన్ అని ప్రచారం చేయడంతో…హైదరాబాద్ నుంచి ప్రజలంతా గ్రామాలకు వెళ్లడంతో అక్కడ వైరస్ విస్తరిస్తోందన్నారు.ఇప్పుడు కరోనాను కంట్రోల్ చేయడం ప్రభుత్వ తరం కాదని స్పష్టం చేశారు. ప్రజలే స్వయంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీఎం ఇప్పుడైనా ఒక్కరోజు అన్నా కరోనా పై సమీక్ష చేయాలన్నారు నాగం.