ఆజాద్ భద్రత ఒడిశా ప్రభుత్వానిదే

ఆజాద్ భద్రత ఒడిశా ప్రభుత్వానిదే
  • ఆయనకు మెరుగైన వైద్యం అందించాలి
  • తెలంగాణ పౌరహక్కుల సంఘం

బషీర్​బాగ్, వెలుగు: భువనేశ్వర్ జర్పడ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మావోయిస్టు నేత కేశవరావు అలియాస్ ఆజాద్ భద్రత ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ అన్నారు. హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావుతో కలిసి ఆయన మాట్లాడారు. 

జర్పడ జైల్లో అక్టోబర్ 15 నుంచి ఆజాద్ ఆమరణ నిరహార దీక్ష చేస్తున్నారని, ఆయన ఆరోగ్యం క్షీణించడంతో అధికారులు హాస్పిటల్​కు తరలించారని తెలిపారు. ఆజాద్ ఆరోగ్యం రోజురోజుకూ  క్షీణిస్తుందని కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారన్నారు. మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న ఆజాద్ ను పోలీసులు లొంగిపోవాలని అతని తల్లి ద్వారా ఒత్తిడి తేవడంతో ఏపీ డీజీపీ ఎదుట 2011 మే 18న లొంగిపోయారని, ఆయనకు ఏపీ ప్రభుత్వం పునరావాసం కల్పించకపోగా, కక్షపూరితంగా ఒడిశా ప్రభుత్వానికి అప్పగించిందని ఆరోపించారు. 

ఒడిశా ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంతో పాటు కోర్టు ఆదేశాల ప్రకారం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి కేసులన్నింటిపై తక్షణమే విచారణ చేపట్టాలన్నారు. ఆజాద్ కు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.