జీవో నం.46ను రద్దు చేయాలి

జీవో నం.46ను రద్దు చేయాలి
  • తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అభ్యర్థుల డిమాండ్​
  • ఇందిరా పార్కు వద్ద నిరసన దీక్ష

ముషీరాబాద్, వెలుగు: స్పెషల్ పోలీస్ నియామకాల్లో జీవో నం.46ను రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్​ చేశారు. ఈ జీవో వల్ల గ్రామీణ ప్రాంత యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో నియమించే తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో జీఓ నం.46 ప్రకారం ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు 53% రిజర్వేషన్లు కల్పించి మిగతా జిల్లాలకు 47% కేటాయిస్తున్నారన్నారు. దీని వల్ల జిల్లాల్లోని అభ్యర్థులకు 130 మార్కులు వచ్చినా ఉద్యోగం రాని పరిస్థితి ఉందని, హైదరాబాద్ జిల్లాలో 80 మార్కులకే జాబ్​ వచ్చే అవకాశం ఉందన్నారు. నోటిఫికేషన్ లో ఎక్కడా జిల్లాల ప్రస్తావన లేదని, సెలక్షన్ సమయంలో ఈ జీవోను తెరపైకి  తెచ్చారన్నారు. 

తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అంటేనే రాష్ట్రస్థాయి క్యాడర్​ అని, ఇందులో సెలక్ట్​ అయిన వాళ్లు రాష్ట్రం మొత్తం ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుందన్నారు. అలాంటప్పుడు జిల్లా, హైదరాబాద్ రిజర్వేషన్లు ఎందుకని ప్రశ్నించారు. వెంటనే  జీవో నం.46 రద్దు చేసి 2016, 2018లో మాదిరిగా నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వీరి నిరసన దీక్షకు టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోబోమని, వారికి న్యాయం జరిగే వరకు  కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. దీక్షలో అభ్యర్థులు అనిల్, మధు, కరుణాకర్, గౌతమ్, హరీష్, రాజవర్ధన్, బద్రి, వెంకట్ రాములు తదితరులు పాల్గొన్నారు.