అర్హులకు త్వరలోనే పోడు పట్టాలు : మంత్రి సత్యవతి రాథోడ్​

అర్హులకు త్వరలోనే పోడు పట్టాలు : మంత్రి సత్యవతి రాథోడ్​

హైదరాబాద్, వెలుగు : త్వరలోనే అర్హులైన వారికి పోడు పట్టాలను అందిస్తామని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ చెప్పారు. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు పనిచేస్తున్నదని, గిరిజనులు, మహిళలు, చిన్నారుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ఎస్టీ రిజర్వేషన్లను సీఎం కేసీఆర్​ 6 శాతం నుంచి 10 శాతానికి పెంచారని, దాని వల్ల గిరిజనులకు అవకాశాలు మరింత పెరిగాయని చెప్పారు. శనివారం హైదరాబాద్​లో దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్​లో ఎస్ఆర్ శంకరన్​ కాన్ఫరెన్స్​ హాలును ఆమె ప్రారంభించారు. ఆ తర్వాత అధికారులతో కలిసి కేక్​ కట్​ చేసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.

ఇటీవల శీతాకాల విడిది కోసం రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆదివాసీల కోసం సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపించారని సత్యవతి రాథోడ్​ చెప్పారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్​ చోంగ్తు, స్పెషల్​ సెక్రటరీ శ్రీధర్​ తదితర అధికారులు పాల్గొన్నారు.