
- మహిళా ప్యాసింజర్ల భద్రత కోసం ఉమెన్ సేఫ్టీ వింగ్ చర్యలు
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్యాసింజర్ల భద్రతను మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో టీజీఎస్‌ఆర్టీసీ, మెట్రో రైలు, రవాణా శాఖ, ప్రైవేట్ ట్రావెల్స్, ఆటో డ్రైవర్ల సంఘాలతో కలిసి సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేసింది. మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేక నోడల్ ఆఫీసర్లను నియమించింది.
ఈ వివరాలను ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారు సిన్హా శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మహిళలు, బాలికలు సురక్షితంగా ప్రయాణించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాల్లో జరిగే లైంగిక వేధింపుల ఘటనలకు వెంటనే స్పందించనున్నట్లు తెలిపారు. బాధిత మహిళలు బస్ కండక్టర్లకు నేరుగా తమ సమస్యను తెలియజేయడంతో పాటు డయల్ 100, 112 నంబర్లకు స్వయంగా డయల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.