తెలంగాణ ఏమైనా కేటీఆర్ రాజ్యమా? : కాసాని జ్ఞానేశ్వర్

తెలంగాణ ఏమైనా కేటీఆర్ రాజ్యమా?  :  కాసాని జ్ఞానేశ్వర్

హైదరాబాద్, వెలుగు: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా తెలంగాణలో నిరసనలు చేపట్టవద్దని మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లు సరికాదని రాష్ట్ర టీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. నిరసనలు చేయవద్దని ఫత్వా జారీ చేయడానికి తెలంగాణ రాష్ట్రం ఏమైనా ప్రత్యేక దేశమా?.. లేక కేటీఆర్ రాజ్యమా? అని ఫైర్ అయ్యారు.  అన్యాయం జరిగితే ప్రజాస్వామ్య యుతంగా ప్రపంచంలో ఎక్కడైనా నిరసనలు చేపట్టే హక్కు ఉందని తెలిపారు. 

అలాంటిది ఉమ్మడి రాష్ట్రానికి 9 ఏండ్లు సీఎంగా  పనిచేసిన చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసించే హక్కు తెలంగాణ ప్రజలకు లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం కాదా?.. దేశంలో వర్తించే రాజ్యాంగ చట్టాలు తెలంగాణలో అమల్లో  లేవా? అని నిలదీశారు.  మద్యం కేసులో సిసోడియా అరెస్టును ఖండించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్.. వారి ఫ్యామిలీకి రాజకీయ ఉన్నతిని కల్పించిన చంద్రబాబు అరెస్టుపై స్పందించకపోవడం దివాళ కోరుతనమని విమర్శించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వస్తున్నారని తెలిపారు. టీడీపీకి  అంచనాలకు మించి మద్దతు వస్తుంటే జీర్ణించుకోలేకే కేటీఆర్ చౌకబారు కామెంట్లు చేస్తున్నారని కాసాని పేర్కొన్నారు.