ఓటే వజ్రాయుధం

ఓటే వజ్రాయుధం

భారతదేశం అతి పెద్ద  ప్రజాస్వామ్య దేశం.  ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా పాలకులను ఎన్నుకొంటారు. అయితే ప్రజలు తమ ఓటును సక్రమంగా వినియోగించుకున్నప్పుడే  ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. సుపరిపాలన సాధ్యమవుతుంది.  మనదేశంలో  ఓటింగ్ శాతం తక్కువేనని గణాంకాలు తెలుపుతున్నాయి. చదువుకోనివారు, ముఖ్యంగా గ్రామాల్లో ఉండే వృద్ధులు తాము ఓటు వేయకుంటే చనిపోయామని భావిస్తారని ఓపిక లేకున్నా ఓటు వేస్తారు. కానీ, చాలామంది చదువుకున్నవారు మాత్రం ఎన్నికలను లైట్​గా తీసుకుంటున్నారు.    త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.  ఏప్రిల్ 15 వరకు కొత్తగా ఓటు హక్కు  నమోదు చేసుకోవచ్చు.  అర్హత ఉన్నవారు అందరూ  ఓటు హక్కు నమోదు చేయించుకోవాలి.  ఓటు హక్కు ఉన్నవారు తప్పనిసరిగా ఓటు వేయాలి.   పోలింగ్ స్లిప్పులు పంపిణీకి ఏర్పాట్లు చేసింది. అలాగే హోం ఓటింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది.  85 ఏండ్లు నిండినవారు, దివ్యాంగులు హోం ఓటింగ్​కు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఒక వ్యక్తి ఎక్కడ ఓటు వేయవచ్చు?

సాధారణంగా ఒక వ్యక్తి తను  నివసించే ప్రదేశంలో ఓటు వేయొచ్చు.  రెండు లేదా అంతకంటే ఎక్కువ వేర్వేరు ప్రదేశాల నుంచి ఓటు వేసినట్లయితే అది నేరంగా పరిగణిస్తారు. ఎన్నికల సంఘం ప్రతి ఐదేండ్లకోసారి, ఎన్నికల ముందు కూడా ఓటర్ల జాబితాలను సవరిస్తుంది.   జర్నలిస్టులు విధి నిర్వహణలో ఎన్నికల వార్తలు కవర్ చేస్తుంటారు. వీరికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం లేదు. వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలి. ఇలా చేస్తే ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. ఆన్ లైన్ ఓటింగ్ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి.  ఇక రెండు చోట్ల ఓటింగ్ నిరోధించడానికి ఓటర్ స్లిప్పులను ఆధార్ కార్డ్ తో అనుసంధానం చేయాలి.  

ఓటుతోనే మన భవిష్యత్

ఓటు వేయడం అందరి బాధ్యత. వజ్రాయుధం లాంటి ఓటును ఖచ్చితంగా,  సరైన రీతిలో ఉపయోగించుకోవాలి.  దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించే నేతలను ఎన్నుకోవాలి.

ఆన్  లైన్ సేవలు

ఎన్నికల సంఘం టెక్నాలజీని ఉపయోగిస్తోంది.  ఆఫ్ లైన్​తో పాటు ఆన్ లైన్​లో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్నిసార్లు మన ప్రయత్నం లేకుండానే మన ఓటును ఓటర్ల లిస్ట్ నుంచి తొలగిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ ద్వారా ఓటు ఉందో  లేదో తెలుసుకోవాలి. పొరపాటున ఓటు హక్కు తొలగిస్తే మళ్లీ అప్లై చేసుకోవాలి.  ఆన్ లైన్  ద్వారా ఎన్నికల సంఘానికి మనం ఫిర్యాదు కూడా చేయొచ్చు.

కూర సంతోష్, సీనియర్ జర్నలిస్ట్