జ్ఞానవాపి మసీదులో హిందూ దేవుళ్ల బొమ్మలు!

జ్ఞానవాపి మసీదులో హిందూ దేవుళ్ల బొమ్మలు!

న్యూఢిల్లీ: యూపీలోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో హిందూ దేవుళ్ల ఆనవాళ్లు ఉన్నాయని సర్వే​లో తేలినట్లు సమాచారం. వారణాసిలోని శృంగార్ గౌరీ కాంప్లెక్స్​లో ఉన్న మసీదులో శివలింగం బయటపడటంతో ప్రత్యేక కమిషన్‌ ఆధ్వర్యంలో వీడియో సర్వేకు కోర్టు ఆదేశించింది. ఈ నెల 14, 15, 16 తేదీల్లో వీడియో సర్వే చేపట్టిన కమిషన్ గురువారం వారణాసి కోర్టుకు రిపోర్టును అందజేసింది. అయితే, పిటిషనర్ల తరఫు లాయర్ల ద్వారా సర్వే రిపోర్టులోని వివరాలు మీడియాకు లీక్ అయినట్లు తెలుస్తోంది. లీక్ అయిన వివరాల ప్రకారం.. మసీదు బేస్​మెంట్​లోని  2 పెద్ద పిల్లర్లు హిందూ గుడికి చెందిన వాటిలాగే ఉన్నాయి. పిల్లర్లపై కలశం, పుష్పాలు చెక్కిన గుర్తులు ఉన్నాయి.  ఓ పిల్లర్​పై ప్రాచీన హిందీ భాషలో రాతలు ఉన్నాయి. బేస్ మెంట్ గోడపై త్రిశూలం బొమ్మ కూడా ఉంది. మసీదు మధ్య గుమ్మటం కింద కమలం గుర్తు చెక్కిన ఓ శిల ఉంది. మసీదు వద్ద ఉన్న కోనేరులో 2.5 ఫీట్ల శివలింగం ఉందని పిటిషనర్లు చెప్పగా, అది ఫౌంటైన్ అని మసీదు కమిటీ వాదించింది. కాగా, ఈ కేసుపై ఈ నెల 20న తాము విచారణ చేపడతామని, అప్పటివరకు విచారణ నిలిపివేయాలని గురువారం వారణాసి కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.