దేశంలో స్కూల్ ఫీజుల గోల : 3వ క్లాసుకు రూ.3 లక్షలు కడుతున్నాం.. మేం 9 లక్షలు కడుతున్నాం..

దేశంలో స్కూల్ ఫీజుల గోల : 3వ  క్లాసుకు రూ.3 లక్షలు కడుతున్నాం.. మేం 9 లక్షలు కడుతున్నాం..

కాలం గడుస్తున్న కొద్దీ చదువు యొక్క నిర్వచనం మారుతూ వస్తోంది.మన పూర్వీకుల కాలంలో సంపన్న వర్గాలకే పరిమితమైన చదువు, ఆ తర్వాత ప్రాథమిక హక్కుగా మారింది. ప్రతి ఒక్కరు చదువుకోవాలన్న అవగాహన జనాల్లో పెరిగింది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నప్పటికీ ఎప్పుడైతే, విద్యావ్యవస్థను కార్పొరేట్ శక్తులు ఆవహించాయో అప్పటి నుండి సీన్ పూర్తిగా మారింది. వర్గ బేధం లేకుండా సమానంగా అందాల్సిన చదువులో వ్యత్యాసం మొదలైంది. ప్రభుత్వ బడుల్లో ఉచితంగా చదువుకునే పరిస్థితి పోయి లక్షలు పోసి చదువు 'కొనాల్సిన' పరిస్థితి ఏర్పడింది.

అసలే లక్షల్లో ఉన్న స్కూల్ ఫీజులను కార్పొరేట్ స్కూళ్ళ యాజమాన్యాలు ఏటా 10శాతం వరకూ పెంచుతూ మధ్యతరగతి ప్రజల నెత్తిన మరింత భారం మోపుతున్నాయి. గురుగ్రామ్ కి చెందిన ఒక పేరెంట్ చేసిన ట్వీట్ ఇందుకు నిదర్శనంగా చెప్పచ్చు. స్కూల్ ఫీజుల పెంపుపై స్పందిస్తూ ట్వీట్ చేసిన సదరు పేరెంట్ "3వ తరగతి చదువుతున్న తమ పిల్లాడి స్కూల్ ఫీజ్ ఏటా 10శాతం పెరుగుతోందని, ప్రస్తుతం నెలకు 30వేల రూపాయలు కడుతున్నానని, ఇలా అయితే పిల్లాడు 12వ తరగతి వెళ్లేసరికి ఏడాది రూ.9లక్షలు చెల్లించాల్సి వస్తుందని తన గోడు వెళ్లగక్కాడు.

ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయ్యింది. కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాల ఆగడాలతో విసిగిపోయిన పేరెంట్స్ అంతా ఆ ట్వీట్ కింద కామెంట్స్ రూపంలో తమ బాధ వ్యక్తం చేస్తున్నారు. ఇతర కార్పొరేట్ స్కూళ్ల తీరు కూడా ఇలాగే ఉందని, అడ్డు అదుపు లేకుండా పెంచుకుంటూ పోతున్నారని కామెంట్ చేస్తున్నారు. స్కూల్ ఫీజులు నియంత్రించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అంటున్నారు.